సోషల్‌ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు

సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి.

Updated : 18 Apr 2024 05:07 IST

సొంత బిడ్డను చంపుకొన్న రష్యన్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. రష్యాలో ఓ ఇన్‌ఫ్లుయెన్సరు చేసిన ప్రయోగాలకు సొంత బిడ్డే బలి కాగా, కోర్టు అతడికి ఎనిమిదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఏడాది క్రితం జరిగిన ఆ దారుణ ఘటనలో నేరం రుజువు కావటంతో తాజాగా కోర్టు తీర్పు చెప్పింది. మాక్సిమ్‌ లైయుటీ అనే ఇన్‌ఫ్లుయెన్సరు పచ్చి కూరగాయలతో ప్రత్యేక డైట్‌ల గురించి చెబుతూ సోషల్‌ మీడియా వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేసేవాడు. మనిషి బతకడానికి అసలు ఆహారమే అవసరం లేదని.. కేవలం సూర్యరశ్మితో ఎంతకాలమైనా జీవించవచ్చనేది అతడి భ్రమ. దీన్ని యూజర్లకు చెబుతూ.. నిరూపించటం కోసం నెలల పసికందు అయిన సొంతబిడ్డపై ప్రయోగానికి సిద్ధమయ్యాడు. భార్య ఎంత వారించినా మాక్సిమ్‌ వినలేదు. ఆ శిశువుకు పాలు పట్టవద్దని హెచ్చరించేవాడు. చిన్నారి ఆరోగ్యం క్షీణిస్తున్నా.. ఎండలో ఉంచితే రోగనిరోధక శక్తి దానంతట అదే పెరిగి కోలుకుంటాడని మొండిగా వాదించేవాడు. తల్లి ఆగలేక ఒక్కోసారి దొంగచాటుగా పాలు పట్టేది. బాబు ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఇబ్బంది పడుతున్నా వైద్యుల వద్దకు తీసుకువెళ్లేందుకు అనుమతించేవాడు కాదు. బలహీనంగా ఉన్న చిన్నారిని చన్నీటిలో ముంచేవాడు. దీనివల్ల శరీరం దృఢంగా తయారవుతుందనేవాడు. బాలుడి ఆరోగ్యం మరింత క్షీణించి శ్వాస తీసుకోవడంలోనూ సమస్యలు ఎదురవడంతో ఇతరుల ఒత్తిడితో బిడ్డను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి చేయిదాటి బాబు ప్రాణాలు కోల్పోయాడు. వైద్యపరీక్షల్లో నిమోనియా సహా పలు సమస్యల వల్ల చిన్నారి చనిపోయినట్లు తేలింది. విషయం తెలుసుకున్న పోలీసులు మాక్సిమ్‌పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో మాక్సిమ్‌ ఏదేదో చెప్పి బుకాయించినా.. చిన్నారి తల్లి మాత్రం ఉన్న విషయం చెప్పేసింది. కోర్టు ఆమెకు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. ఏడాది విచారణ తర్వాత మాక్సిమ్‌ నేరాన్ని అంగీకరించడంతో అతడికి ఎనిమిదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కొసమెరుపు ఏమిటంటే.. అందరికీ పచ్చి కూరగాయలు తినాలని చెప్పిన అతడే కస్టడీలో ఉన్నప్పుడు నూడుల్స్‌, మాంసం వంటివి కావాలనేవాడని అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని