దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం

ఖతర్‌ రాజధాని దోహాలోని హమద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్‌పోర్టుగా నిలిచింది.

Published : 19 Apr 2024 06:09 IST

దిల్లీ 36, హైదరాబాద్‌ 61 స్థానాల్లో

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఖతర్‌ రాజధాని దోహాలోని హమద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్‌పోర్టుగా నిలిచింది. సింగపూర్‌కు చెందిన ఛాంగి రెండోస్థానంలో ఉంది. ఈ జాబితాలో తొలి రెండు స్థానాలను గత కొన్నేళ్లుగా ఈ రెండు విమానాశ్రయాలే  పంచుకొంటూ ఉండటం విశేషం. స్టార్‌ రేటింగుతో ‘స్కైట్రాక్స్‌’ ఏటా విడుదల చేసే ప్రపంచ అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాలో గతేడాది ఛాంగి అగ్రభాగాన నిలిచింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని ఇన్చెయాన్‌ విమానాశ్రయం ఈసారి మూడోస్థానం దక్కించుకొంది. 2024లో ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎయిర్‌పోర్టుగానూ ఇది అవార్డు సొంతం చేసుకుంది. టోక్యోలోని హనీదా, నరీతా వరుసగా నాలుగు, అయిదు స్థానాలు దక్కించుకున్నాయి. హాంకాంగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ఏకంగా 22 స్థానాలు ఎగబాకి 11వ ర్యాంకుకు చేరుకోవడం విశేషం. కొవిడ్‌ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయడంతో విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడం ఇందుకు దోహదం చేసింది.

  • అమెరికాకు చెందిన ఏ ఒక్క విమానాశ్రయం  తొలి 20 స్థానాల్లో లేకపోవడం గమనార్హం. సియాటెల్‌లోని టకోమా ఎయిర్‌పోర్టుకు దక్కిన 24వ ర్యాంకే ఆ దేశానికి అత్యుత్తమమైనది. ఐరోపాలో ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌ చార్లెస్‌ డి గలే, మ్యూనిక్‌ (జర్మనీ), జ్యూరిచ్‌ (స్విట్జర్లాండ్‌) విమానాశ్రయాలు టాప్‌-10లో చోటు దక్కించుకున్నాయి.
  • ఈ జాబితాలో తొలి వంద ఎయిర్‌పోర్టుల్లో భారత్‌కు చెందినవి నాలుగు మాత్రమే ఉన్నాయి. దిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 36వ స్థానంలో ఉండగా.. బెంగళూరు స్థానం కొంత మెరుగై 69 నుంచి 59కి చేరింది. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు స్థానం 65 నుంచి 61కి ఎగబాకింది. ముంబయి ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు మాత్రం 84 నుంచి 95వ స్థానానికి పడిపోయింది. దిల్లీ విమానాశ్రయం దక్షిణాసియాలో ఉత్తమ ఎయిర్‌పోర్టుగా నిలిచింది. సిబ్బంది సేవల్లో హైదరాబాద్‌ దక్షిణాసియాలో అగ్రస్థానం దక్కించుకుంది. అలాగే దక్షిణాసియాలో ఉత్తమ ప్రాంతీయ ఎయిర్‌పోర్టుగా బెంగళూరు నిలిచింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని