భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ

అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు.

Published : 19 Apr 2024 05:12 IST

ఇంకా వరదనీటిలోనే ప్రధాన రహదారులు

దుబాయ్‌, తిరువనంతపురం: అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. ప్రధాన రహదారులు సహా సాధారణ రోడ్లు ఇంకా వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. జలమయమైన దుబాయ్‌ విమానాశ్రయాన్ని మాత్రం స్థానిక అధికారులు, సిబ్బంది సాధారణ స్థాయికి తీసుకువచ్చారు. టెర్మినల్‌ 1 నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అనుమతించారు. మంగళవారం దుబాయ్‌లో 142 మిల్లీమీటర్ల వర్షం కురిసిన సంగతి తెలిసిందే. గురువారానికి నివాస ప్రాంతాల్లో నీరు తగ్గడంతో వరదలో మునిగిపోయిన కార్లు బయటపడ్డాయి. మరోపక్క పాఠశాలలకు వచ్చే వారం వరకూ సెలవులిచ్చారు. మొత్తం మీద పెద్దగా ఆస్తి నష్టం కలగలేదని, ఒకరు మరణించారని అధికారులు తెలిపారు.

సహాయ నంబర్లను ప్రారంభించిన భారత్‌

యూఏఈలో భారీ వర్షాల నేపథ్యంలో ఇబ్బందులెదుర్కొంటున్న భారతీయుల కోసం భారత రాయబార కార్యాలయం సహాయ నంబర్లను ఏర్పాటు చేసింది. సహాయం అవసరమైనవారు +971501205172, +971569950590, +971507347676, and +971585754213 ఈ నంబర్లకు ఫోను చేయాలని సూచించింది.

దుబాయ్‌లో చిక్కుకుపోయిన ప్రయాణికులను రక్షించేందుకు యూఏఈ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఎమిరేట్స్‌లో సహాయం అవసరమైన భారతీయులను ఆదుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయాలంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ గురువారం భారత విదేశీ వ్యవహారాలశాఖకు విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని