ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడి!

పశ్చిమాసియా మళ్లీ వేడెక్కింది. ప్రతీకారం తప్పదని గత కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీచేస్తున్న ఇజ్రాయెల్‌.. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్‌పై దాడి చేసింది.

Updated : 20 Apr 2024 19:21 IST

 పరిమిత స్థాయిలో డ్రోన్లు, క్వాడ్‌ కాప్టర్లు, క్షిపణుల ప్రయోగం
అణుకేంద్రాలు, వైమానిక  స్థావరాలే లక్ష్యం
ఇస్ఫహాన్‌ నగరంలో భారీ పేలుళ్లు
ఇరాన్‌ మీడియాలో మూడు డ్రోన్లు కూల్చినట్లు వార్తలు

దుబాయ్‌: పశ్చిమాసియా మళ్లీ వేడెక్కింది. ప్రతీకారం తప్పదని గత కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీచేస్తున్న ఇజ్రాయెల్‌.. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్‌పై దాడి చేసింది. ఇందుకు ఆ దేశ సుప్రీం అధినేత అయాతుల్లా అలీ ఖొమేనీ 85వ పుట్టిన రోజునే ఎంచుకోవడం గమనార్హం. అణు, సైనిక స్థావరాలకు ప్రధాన కేంద్రమైన ఇరాన్‌లోని మూడో అతి పెద్ద నగరమైన ఇస్ఫహాన్‌పై డ్రోన్లు, క్వాడ్‌ కాప్టర్లు, క్షిపణులు ప్రయోగించింది. దాడిలో పెద్దగా నష్టం జరగలేదని తెలుస్తోంది. ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడిని అమెరికా అధికారులు ధ్రువీకరించారు. టెల్‌అవీవ్‌ మాత్రం అధికారికంగా స్పందించలేదు. ఇరాన్‌ కూడా ఈ విషయంలో మౌనం వహించడం విశేషం. ఈ నెల 13న మూడువందలకుపైగా డ్రోన్లు, క్షిపణులతో భారీ స్థాయిలో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడినప్పటినుంచి ఇజ్రాయెల్‌ ప్రతీకారంతో రగిలిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై నెతన్యాహు భారీగా విరుచుకుపడతారని అందరూ భావించారు. కానీ పరిమిత స్థాయిలోనే క్షిపణులు, డ్రోన్లను ఇజ్రాయెల్‌ ప్రయోగించినట్లు తెలుస్తోంది.

తెల్లవారుజామునే భారీ పేలుళ్లు

ఇరాన్‌లో ఇస్ఫహాన్‌ ప్రావిన్సులో తెల్లవారుజామునే భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.. వెంటనే ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులు ప్రారంభమైనట్లు అమెరికా సైనిక వర్గాలను ఉటంకిస్తూ న్యూయార్క్‌ టైమ్స్‌, వాషింగ్టన్‌ పోస్ట్‌ తదితర పత్రికలు పేర్కొన్నాయి. ఇరాన్‌ మాత్రం ఖండించింది. తమ గగనతలంలో కనిపించిన అనుమానాస్పద వస్తువులను యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ తుపాకులతో నేలకూల్చామని, ఆ సందర్భంగా పేలుళ్లు జరిగాయని పేర్కొంది. దాడుల సమయంలో టెహ్రాన్‌ తన గగనతలాన్ని మూసివేసింది. పలు విమానాలను దారి మళ్లించింది. గగనతల రక్షణ వ్యవస్థను యాక్టివేట్‌ చేసింది. అయితే ఎక్కడా ఇజ్రాయెల్‌ దాడి చేసినట్లు అధికారికంగా ప్రకటించలేదు. మూడు డ్రోన్లను కూల్చివేసినట్లు మాత్రం ఆ దేశ ప్రభుత్వ మీడియా ఐఆర్‌ఎన్‌ఏ తెలిపింది.

ఇస్ఫహానే ఎందుకు..

వ్యూహాత్మకంగా, సైనికపరంగా ఇస్ఫహాన్‌ కీలక ప్రాంతం. పలు సైనిక స్థావరాలు, పరిశోధన కేంద్రాలు, అణుకేంద్రాలకు నిలయం. ఇరాన్‌ ప్రధాన వైమానిక స్థావరం ఇక్కడే ఉంది. అణుశుద్ధి కేంద్రం ఉన్న నతాంజ్‌ నగరమూ ఇస్ఫహాన్‌కు సమీపంలోనే ఉంది. భారీ సంఖ్యలో డ్రోన్‌, బాలిస్టిక్‌ క్షిపణుల తయారీ కర్మాగారాలూ ఇక్కడే ఉన్నాయి. అందుకే ఈ నగరాన్ని టెల్‌ అవీవ్‌ లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్‌లోని ఏ అణుకేంద్రానైన్నా తాము సునాయాసంగా లక్ష్యం చేసుకోగలమన్న సందేశం ఇవ్వడం కూడా ఇస్ఫహాన్‌ను ఇజ్రాయెల్‌ ఎంచుకోవడానికి కారణమని రక్షణ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అణు కేంద్రాలపై ఎలాంటి దాడుల జరగలేదని, సురక్షితంగా ఉన్నాయని ఇరాన్‌ మీడియా వెల్లడించింది. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

ఆఖరి నిమిషంలో అగ్రరాజ్యానికి..

ఇరాన్‌లో పేలుళ్ల వెనక ఇజ్రాయెల్‌ ఉందని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఇజ్రాయెల్‌ సైన్యం మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. దాడికి ముందు ఇజ్రాయెల్‌, అమెరికా రక్షణ మంత్రులు ఫోన్లో మాట్లాడుకున్నట్లు పెంటగాన్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఇటలీ విదేశాంగమంత్రి ఆంటోనియో టజాని మాత్రం ఆఖరి నిమిషంలోనే దాడి విషయాన్ని అమెరికాకు ఇజ్రాయెల్‌ చెప్పిందని పేర్కొన్నారు. జీ7 విదేశాంగమంత్రుల సమావేశంలో ఈ విషయాన్ని అమెరికా తెలిపిందని అన్నారు. దాడులు, ప్రతి దాడులు ఆపాలని ఇరు దేశాలను ఐక్యరాజ్యసమితి కోరింది. ఉద్రిక్తతలను నివారించేందుకు అంతర్జాతీయ సమాజం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.


ఇజ్రాయెల్‌ను వీడండి

తాజా పరిణామాలతో ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది. పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఇజ్రాయెల్‌లోని ఆస్ట్రేలియన్లు తక్షణమే ఆ దేశాన్ని వీడాలని హెచ్చరించింది. ఈ దాడులతో గగనతలాన్ని మూసివేసే అవకాశముందని హెచ్చరించింది.

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నెల 30 వరకు టెల్‌ అవీవ్‌కు తమ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎయిరిండియా ఒక ప్రకటనలో తెలిపింది.


‘రాకెట్లను అంతరిక్షంలోకి పంపిద్దాం’

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతల వేళ ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్‌ఎక్స్‌ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ‘‘మనమంతా రాకెట్లను పరస్పరం ప్రయోగించుకోవడం మాని.. అంతరిక్షంలోకి పంపించాలి’’ అంటూ శాంతియుత పరిస్థితులకు ఆయన పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని