ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ పిడుగు!

ప్రపంచంలో మెరుగైన గగనతల రక్షణ వ్యవస్థల్లో ఎస్‌-300 ఒకటి. ఎలాంటి క్షిపణినైనా పసిగట్టి కూల్చేయగల సామర్థ్యం దీని సొంతం.

Published : 21 Apr 2024 05:26 IST

ఎస్‌-300 గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన టెల్‌ అవీవ్‌
ప్రకంపనలు సృష్టిస్తున్న న్యూయార్క్‌టైమ్స్‌ కథనం

వాషింగ్టన్‌: ప్రపంచంలో మెరుగైన గగనతల రక్షణ వ్యవస్థల్లో ఎస్‌-300 ఒకటి. ఎలాంటి క్షిపణినైనా పసిగట్టి కూల్చేయగల సామర్థ్యం దీని సొంతం. అలాంటి వ్యవస్థనే శుక్రవారం ఇజ్రాయెల్‌ క్షిపణులు ధ్వంసం చేశాయని న్యూయార్క్‌ టైమ్స్‌ (ఎన్‌వైటీ) ప్రచురించిన కథనం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇదే వాస్తవమైతే ఇరాన్‌ అణుకేంద్రాల భద్రత ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్‌ అణుకేంద్రాలకు ఎస్‌-300లే కాపలా. పత్రిక కథనం ప్రకారం.. దీని రాడార్‌ వ్యవస్థకే దొరకకుండా ఇజ్రాయెల్‌ క్షిపణి ప్రయోగించిందని, అది నతాంజ్‌ అణుకేంద్రానికి కాపలాగా ఉన్న ఎస్‌-300 వ్యవస్థను ధ్వంసం చేసిందని చెబుతోంది. రాడార్లకు దొరకకుండా ఇరాన్‌లోని ఏ లక్ష్యాన్నైనా ఛేదించగల సామర్థ్యం తమకు ఉందని టెల్‌ అవీవ్‌ నిరూపించుకుందని రక్షణరంగ నిపుణులు అంటున్నారు. ఈ క్షిపణిని యుద్ధ విమానం నుంచి ప్రయోగించినట్లు ఆ పత్రిక పేర్కొంది.

ఆ డ్రోన్లు మాకు ఆటబొమ్మలు

ఇస్ఫహాన్‌ నగరంపై శుక్రవారం జరిగిన దాడిపై ఇరాన్‌ విదేశాంగమంత్రి హుసేన్‌ అమీర్‌ అబ్దుల్లాహియాన్‌ స్పందించారు. ‘‘గత రాత్రి జరిగింది దాడి కాదు. అవి డ్రోన్లు కూడా కాదు. మా పిల్లలు ఆడుకొనే ఆటబొమ్మల్లా ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. ‘ఎన్‌బీసీ’ న్యూస్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఇజ్రాయెల్‌ వ్యవహరిస్తే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.  

‘పీఎంఎఫ్‌’ పై దాడి

ఇరాక్‌లోని ఇరాన్‌ అనుకూల పాపులర్‌ మొబిలైజేషన్‌ ఫోర్సెస్‌(పీఎంఎఫ్‌) సైనిక స్థావరంపై శనివారం దాడి జరిగింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరాన్‌ మద్దతు ఉన్న షియా మిలిటెంట్‌ సంస్థల్లో పీఎంఎఫ్‌ ఒకటి. ఇటీవల కాలంలో ఇరాక్‌, సిరియాలోని అమెరికా సైనిక స్థావరాలపై పీఎంఎఫ్‌ గ్రూప్‌ సభ్యులు దాడి చేసిన సంఘటనలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో అగ్రరాజ్యంపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా మాత్రం ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ ఘటనపై ఇరాక్‌ విచారణ చేపట్టింది.

ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్‌కు అమెరికా భారీ సాయం

యుద్ధంలో ఉన్న ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్‌లకు అమెరికా భారీ ఆర్థిక సాయం అందించనుంది. శనివారం జరిగిన అసాధారణ సమావేశంలో అమెరికా చట్ట సభ 95 బిలియన్‌ డాలర్ల సాయానికి ఆమోద ముద్ర వేసింది. ఇందుకోసం సభలో డెమోక్రాట్లు, రిపబ్లికన్లు చేతులు కలిపారు. ఉక్రెయిన్‌కు 61 బిలియన్‌ డాలర్లు, ఇజ్రాయల్‌కు 26 బిలియన్‌ డాలర్లను, మిగిలిన వాటిని గాజాలో మానవతా సాయానికి అమెరికా అందించనుంది.


రఫాపై దాడులు.. 9 మంది మృతి

రఫా: అమెరికా వద్దంటున్నా.. రఫా నగరంపై ఇజ్రాయెల్‌ దాడులు ప్రారంభించింది. శుక్రవారం రాత్రి ఆ దేశం జరిపిన వైమానిక దాడుల్లో తొమ్మిదిమంది మృతి చెందారు. ఇందులో ఆరుగురు చిన్నారులే. గాజాకు దక్షిణాన.. ఈజిప్టునకు సమీపంలోని ఉన్న ఈ నగరంలో ఇప్పుడు దాదాపు 12 లక్షలకు పైగా ప్రజలు ఉన్నారు. ఇందులో చాలామంది ఇజ్రాయెల్‌ దాడి కారణంగా ఉత్తరగాజా, మధ్య గాజాను ఖాళీ చేసి వచ్చిన పాలస్తీనియన్లే. ఈ నగరంపై దాడి చేస్తే అతి పెద్ద మానవ సంక్షోభం ఏర్పడుతుందని అమెరికా, బ్రిటన్‌ సహా పలు దేశాలు భయపడుతున్నాయి. అయినా ఇజ్రాయెల్‌ వెనక్కి తగ్గడం లేదు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని