భూతాప పరిమితికి ప్లాస్టిక్‌తో తూట్లు

ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్‌ ఉత్పత్తి ప్రస్తుతమున్న రీతిలోనే కొనసాగితే.. భూతాపాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలన్న లక్ష్యానికి విఘాతం కలుగుతుందని తాజా అధ్యయనం పేర్కొంది.

Published : 21 Apr 2024 06:26 IST

తాజా అధ్యయనంలో వెల్లడి

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్‌ ఉత్పత్తి ప్రస్తుతమున్న రీతిలోనే కొనసాగితే.. భూతాపాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలన్న లక్ష్యానికి విఘాతం కలుగుతుందని తాజా అధ్యయనం పేర్కొంది. అమెరికాకు చెందిన లారెన్స్‌ బెర్కలీ నేషనల్‌ లేబొరేటరీ శాస్త్రవేత్తలు దీన్ని చేపట్టారు. ప్లాస్టిక్‌ కాలుష్యానికి ముగింపు పలికేందుకు అంతర్జాతీయ ఒప్పందంపై ఈ నెల 23- 29వరకూ కెనడాలో నాలుగో విడత చర్చలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిశోధనకు ప్రాధాన్యం ఏర్పడింది. అధ్యయనంలో వెల్లడైన అంశాలివీ..

  • ప్రాథమిక ప్లాస్టిక్‌ ఉత్పత్తిలో శిలాజ ఇంధనాలను మండించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో హానికర గ్రీన్‌హౌస్‌ వాయువులు వెలువడతాయి. ఇతర విధానాల్లోనూ ఇవి ఉత్పత్తవుతాయి. ఈ ఉద్గారాల్లో 75 శాతం.. ప్లాస్టిక్‌ తయారు కాకముందే ఉత్పత్తవుతాయి. శిలాజ ఇంధనాలను మండించడం వల్లే వాతావరణంలో గ్రీన్‌హౌస్‌ వాయువుల తీవ్రత పెరుగుతోంది. ఫలితంగా ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
  • పారిస్‌ ఒప్పందంలో పేర్కొన్న 1.5 డిగ్రీల పరిమితిని మించకుండా చూడాలంటే ఈ ఏడాది నుంచే ప్రాథమిక ప్లాస్టిక్‌ ఉత్పత్తి ఏటా 12 నుంచి 17 శాతం మేర తగ్గాలి.
  • 2019లోనే ప్రాథమిక ప్లాస్టిక్‌ ఉత్పత్తి వల్ల 2.24 గిగాటన్నుల కార్బన్‌ డైఆక్సైడ్‌కు సమానమైన గ్రీన్‌హౌస్‌ వాయువులు వెలువడ్డాయి. ఇది ప్రపంచ గ్రీన్‌హౌస్‌ ఉద్గారాల్లో 5.3 శాతంగా ఉంది.
  • ఏటా ప్లాస్టిక్‌ ఉత్పత్తిలో 2.5 శాతం పెరుగుతుందనుకున్నా.. 2050 నాటికి ప్రాథమిక ప్లాస్టిక్‌ ఉత్పత్తి ద్వారా గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలు రెట్టింపు స్థాయిలో వెలువడతాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని