పాకిస్థాన్‌కు ‘క్షిపణి’ సాయం

పాకిస్థాన్‌ క్షిపణి కార్యక్రమాలకు పరికరాలు సరఫరా చేస్తున్నాయంటూ.. మూడు చైనా సంస్థలతోపాటు బెలారస్‌కు చెందిన ఓ కంపెనీపై అమెరికా ఆంక్షలు విధించింది.

Published : 21 Apr 2024 05:24 IST

చైనా సంస్థలపై అమెరికా ఆంక్షలు

వాషింగ్టన్‌: పాకిస్థాన్‌ క్షిపణి కార్యక్రమాలకు పరికరాలు సరఫరా చేస్తున్నాయంటూ.. మూడు చైనా సంస్థలతోపాటు బెలారస్‌కు చెందిన ఓ కంపెనీపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ సంస్థలు సామూహిక జనహనన ఆయుధాలు, వాటిని ప్రయోగించే వ్యవస్థల వ్యాప్తికి దోహదపడుతున్నాయని ఆరోపించింది. ఇలాంటి ఆయుధాల తయారీ, సమీకరణ, రవాణాకు పాక్‌ చేస్తున్న ప్రయత్నాలకు సాయపడుతున్నాయని అమెరికా విదేశాంగ ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ తెలిపారు. అణ్వస్త్రాలు, ఆయుధ సాంకేతికత వ్యాప్తిని నిరోధించేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. చిరకాల మిత్రదేశమైన పాక్‌కు ప్రధాన ఆయుధ సరఫరాదారుగా చైనా ఉంది. ఆ దేశ సైనిక ఆధునికీకరణకు తోడ్పడుతోంది. అమెరికా వివరాల ప్రకారం.. బీజింగ్‌కు చెందిన షియాన్‌ లాంగ్డే సంస్థ పాకిస్థాన్‌ దీర్ఘశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి కార్యక్రమానికి ఫిలమెంట్‌ వైండింగ్‌ మెషిన్‌ను సరఫరా చేసింది. క్షిపణులకు సంబంధించిన అనేక పరికరాలనూ అందించింది. ఫిలమెంట్‌ వైండింగ్‌ యంత్రంతో రాకెట్‌ మోటార్‌ తొడుగులను తయారుచేయవచ్చు.

  • చైనాకే చెందిన టియాంజిన్‌ కంపెనీ.. దీర్ఘశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి కార్యక్రమానికి సంబంధించిన సాధన సంపత్తిని పాక్‌కు సరఫరా చేసింది. ఇందులో స్టిర్‌ వెల్డింగ్‌ యంత్రం కూడా ఉంది. దీన్ని అంతరిక్ష వాహకనౌకల్లో వాడే ఇంధన ట్యాంకుల తయారీకి వాడొచ్చు. అలాగే ఘన ఇంధన రాకెట్‌ మోటార్ల తనిఖీకి ఉపయోగించే లీనియర్‌ యాక్సిలరేటర్‌నూ పాక్‌కు అందజేసింది.  
  • డ్రాగన్‌ దేశానికి చెందిన గ్రాన్‌పెక్ట్‌.. పాక్‌కు లార్జ్‌-డయామీటర్‌ రాకెట్‌ మోటార్లను పరీక్షించడానికి అవసరమైన సాధనాలను సరఫరాచేసింది.  
  • బెలారస్‌లోని మిన్స్‌క్‌ వీల్‌ ట్రాక్టర్‌ ప్లాంట్‌.. దీర్ఘశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి కార్యక్రమానికి అవసరమైన ప్రత్యేక వాహన ఛాసీలను విక్రయించింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని