డీప్‌ ఫేక్‌ చిత్రాలతో సింగపూర్‌ ఎంపీలకు బెదిరింపులు

ఆధునిక సాంకేతికత దుర్వినియోగం ఎలాంటి సమస్యలను తీసుకొస్తుందో సింగపూర్‌లో జరిగిన తాజా ఘటన ప్రబల నిదర్శనంగా నిలుస్తోంది.

Updated : 21 Apr 2024 06:22 IST

బాధితుల్లో భారత సంతతి మంత్రి

సింగపూర్‌: ఆధునిక సాంకేతికత దుర్వినియోగం ఎలాంటి సమస్యలను తీసుకొస్తుందో సింగపూర్‌లో జరిగిన తాజా ఘటన ప్రబల నిదర్శనంగా నిలుస్తోంది. ఆ దేశ పార్లమెంటు సభ్యులు పలువురికి ఇటీవల బెదిరింపు లేఖలతో కూడిన కవర్లు పోస్టులో వస్తున్నాయి. వాటిని తెరచి చూడగా అశ్లీల దృశ్యాలతో ఉన్న అసభ్యకరమైన ఫొటోలు దర్శనమిచ్చాయి. ప్రతి సభ్యుడు మహిళలతో ఏకాంతంగా ఉన్నట్లు చిత్రీకరిస్తూ మార్ఫింగ్‌ ద్వారా వారి ముఖాలను అమర్చారు. దీంతో అవి నిజమైన చిత్రాలే అన్నట్లుగా భ్రమింపజేస్తున్నాయి. తనతో పాటు పలువురు ఎంపీలకు ఈ తరహా కవర్లు అందాయని భారత సంతతికి చెందిన విదేశాంగ మంత్రి వివియన్‌ బాలకృష్ణన్‌ సామాజిక మాధ్యమం ద్వారా శనివారం వెల్లడించారు. మార్చి నెల నుంచి ఈ తరహా ఫిర్యాదులు 70 వరకు తమకు అందాయని పోలీసులు చెప్పారు. కృత్రిమ మేధ సాంకేతికత సహాయంతో డీప్‌ ఫేక్‌ చిత్రాలు సృష్టించి బెదిరింపులకు పాల్పడుతూ డబ్బు వసూలు చేయాలన్నది దుండగుల ఎత్తుగడగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. కవర్లలోని బెదిరింపు ఉత్తరాల్లో ఈమెయిల్‌ చిరునామాలు ఇచ్చి వాటి ద్వారా తమను సంప్రదించాలని నేరగాళ్లు సూచిస్తున్నారు. డిప్‌ ఫేక్‌ చిత్రాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను ఈ ఘటన సూచిస్తోందని వివియన్‌ బాలకృష్ణన్‌ అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని