అసాధారణ వాతావరణ పోకడలు ఇక సర్వసాధారణం!

ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఏకకాలంలో తీవ్రస్థాయి వేడి వాతావరణం నెలకొంటున్నాయని తాజా అధ్యయనం పేర్కొంది. వేడెక్కుతున్న భూగోళానికి ఇది నిదర్శనమని తెలిపింది.

Published : 22 Apr 2024 04:38 IST

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఏకకాలంలో తీవ్రస్థాయి వేడి వాతావరణం నెలకొంటున్నాయని తాజా అధ్యయనం పేర్కొంది. వేడెక్కుతున్న భూగోళానికి ఇది నిదర్శనమని తెలిపింది. 2023లో చోటుచేసుకున్న వాతావరణ పరిణామాలను పరిశోధకులు సమీక్షించారు. గడిచిన సంవత్సరంలో ఉత్పన్నమైన అసాధారణ వాతావరణ పరిస్థితులు.. పెరుగుతున్న పుడమి తాపంపై వేసిన అంచనాలకు తగ్గట్టే ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అత్యంత ఉష్ణమయ సంవత్సరంగా 2023 నిలిచింది. భవిష్యత్‌లో మరింత వేడి వాతావరణం నెలకొంటుందని పరిశోధకులు తెలిపారు. ఏడాది ఆరంభంలోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, భారీ వర్షాలను కురిపించే తుపాన్లు సర్వసాధారణమవుతాయన్నారు. అసాధారణ వాతావరణ పోకడలు చోటుచేసుకునే సీజన్లలోనూ వైరుధ్యాలు ఉన్నాయని తెలిపారు. ‘‘వాయవ్య ఐరోపా, బ్రెజిల్‌, మొరాకో, దక్షిణాఫ్రికాలో వసంత రుతువులో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో ఇలాంటి పరిస్థితి చాలా అసాధారణం’’ అని బ్రిటన్‌ వాతావరణశాఖ పరిశోధకుడు రాబిన్‌ క్లార్క్‌ చెప్పారు. ప్రపంచంలో ఏకకాలంలో భిన్న ప్రాంతాల్లో అసాధారణ వాతావరణ పోకడలు చోటుచేసుకుంటున్నాయన్నారు. ‘‘ఈ ధోరణి కొనసాగొచ్చు. గత ఏడాది ఉత్తర అమెరికా, దక్షిణ ఐరోపా, ఉత్తర ఆఫ్రికా, ఆసియాలో జులై నెలలో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తుపాన్ల వల్ల తీవ్రస్థాయి వర్షాలు పెరిగిపోయాయి. 2023 జులైలో ఉత్తర చైనాలో, సెప్టెంబరులో లిబియాలో వచ్చిన వరదలు దీనికి నిదర్శనం. భూతాపం పెరిగిన పరిస్థితుల్లో భవిష్యత్‌లో జరిగే పరిణామాలు ఇదే రీతిలో ఉంటాయని ఇప్పటికే అంచనాలు వేశాం’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని