చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్‌ మెజార్టీ’

మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జుకు చెందిన పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (పీఎన్‌సీ) ‘సూపర్‌ మెజార్టీ’తో విజయం సాధించింది.

Updated : 23 Apr 2024 06:07 IST

మాలే: మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జుకు చెందిన పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (పీఎన్‌సీ) ‘సూపర్‌ మెజార్టీ’తో విజయం సాధించింది. మొత్తం 93 స్థానాలకు గాను సొంతంగా 68 సీట్లను కైవసం చేసుకుంది. దీంతో ముయిజ్జు అనుసరిస్తున్న చైనా అనుకూల విధానానికి దేశంలో బలమైన మద్దతు లభించినట్లయింది. ఆయనకు అగ్నిపరీక్షగా నిలిచిన ఈ ఎన్నికలను అటు చైనా, ఇటు భారత్‌లు నిశితంగా పరిశీలించాయి. మాల్దీవుల పార్లమెంటు (పీపుల్స్‌ మజ్లీస్‌)లోని 93 నియోజకవర్గాలకు ఆదివారం పోలింగ్‌ నిర్వహించారు. మొత్తం 2.84 లక్షల ఓటర్లు ఉండగా.. 75 శాతం పోలింగ్‌ నమోదైంది. ఫలితాల్లో ముయిజ్జుకు చెందిన పీఎన్‌సీ 68 స్థానాలు గెల్చుకోగా.. దాని మిత్రపక్షాలు మాల్దీవ్స్‌ నేషనల్‌ పార్టీ (ఎంఎన్‌పీ) ఒకటి, మాల్దీవ్స్‌ డెవలప్‌మెంట్‌ అలయెన్స్‌ (ఎండీఏ) రెండు సీట్లను గెల్చుకుంది. దీంతో 71 స్థానాలతో కూటమి.. ‘సూపర్‌ మెజార్టీ’ సాధించింది. దీనివల్ల రాజ్యాంగాన్ని సవరించుకునే అధికారం కూడా ముయిజ్జుకు లభిస్తుంది. భారత్‌కు అనుకూలంగా ఉండే మాల్దీవియన్‌ డెమొక్రటిక్‌ పార్టీ (ఎండీపీ) 15 సీట్లకే పరిమితమైంది. ఈ పార్టీ గతంలో 65 స్థానాలను గెలుచుకోవడం గమనార్హం. అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ పార్లమెంటులో పార్టీ బలం తక్కువగా ఉండటంతో ముయిజ్జు సొంత నిర్ణయాలు తీసుకోలేకపోయారు. తాజా విజయంతో.. తనకు నచ్చిన విధానాలను రూపొందించుకునేందుకు ఆయనకు మార్గం సుగమమైనట్లు విశ్లేషకుల అంచనా. ఈ క్రమంలో భారత్‌తో ఆయన దౌత్యపరంగా ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తమ దేశంపై భారత్‌ ప్రభావాన్ని తగ్గించేందుకు ఆయన ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు. చైనాతో ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకునేందుకు కృషి చేశారు. భారత బలగాలను చాలావరకూ వెనక్కి పంపేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని