66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం

అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్‌ రిపోర్ట్‌) పేర్కొంది.

Published : 23 Apr 2024 05:09 IST

తాజా నివేదికలో వెల్లడి

వాషింగ్టన్‌: అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్‌ రిపోర్ట్‌) పేర్కొంది. పౌరసత్వం పొందుతున్న విదేశీయుల్లో మెక్సికో తొలిస్థానంలో ఉండగా, భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. వివిధ దేశాల్లో జన్మించి అమెరికాలో ఉంటున్న వారి సంఖ్య 2022లో 4.6 కోట్లని, ఇది అమెరికా మొత్తం జనాభా అయిన 33.3 కోట్లలో 14 శాతమని అమెరికా జనగణన సంస్థకు చెందిన అమెరికన్‌ కమ్యూనిటీ సర్వే డేటా వెల్లడిస్తోంది. వీరిలో 2.45 కోట్ల మంది తమని సహజీకృత పౌరులుగా పేర్కొన్నారు. 2022 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 9,69,380 మంది సహజీకృత అమెరికా పౌరులుగా మారారని కాంగ్రెషనల్‌ రీసెర్చ్‌ సర్వీస్‌ ఈ నెల 15న ‘అమెరికా నేచురలైజేషన్‌ పాలసీ’ నివేదికలో తెలిపింది. 2022లో 1,28,878 మంది మెక్సికన్లు అమెరికన్‌ పౌరులుగా మారని పేర్కొంది. ఆ తర్వాత భారత్‌ (65,960), ఫిలిప్పీన్స్‌ (53,413), క్యూబా (46,913), డొమినికన్‌ రిపబ్లిక్‌ (34,525), వియత్నాం (33,246), చైనా (27,038) ఉన్నాయి. భారత్‌లో పుట్టి అమెరికాలో ఉంటున్నవారిలో దాదాపు 42 శాతం మందికి అక్కడి పౌరసత్వం పొందే అర్హత లేదని సీఆర్‌ఎస్‌ నివేదిక స్పష్టంచేసింది. అదే సమయంలో 2023 నాటికి గ్రీన్‌ కార్డు లేదా లీగల్‌ పర్మనెంట్‌ రెసిడెన్సీ ఉన్న 2,90,000 మంది భారతీయులు సహజీకృత విధానం కింద పౌరసత్వం పొందే అవకాశం ఉందని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని