అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి

గాజా పోరులో ఇజ్రాయెల్‌కు మద్దతుగా బైడెన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు.

Published : 24 Apr 2024 05:40 IST

పాలస్తీనాకు అనుకూలంగా భారీ నిరసనలు.. అరెస్టులు
యేల్‌, ఎంఐటీ, హార్వర్డ్‌, కొలంబియా యూనివర్సిటీల్లో స్తంభించిన చదువులు

వాషింగ్టన్‌: గాజా పోరులో ఇజ్రాయెల్‌కు మద్దతుగా బైడెన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. భారీస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అమాయకులైన పాలస్తీనా మహిళలు, చిన్నారుల మరణాలకు బైడెన్‌ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. యేల్‌, ఎంఐటీ, హార్వర్డ్‌, కొలంబియా తదితర విశ్వవిద్యాలయాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ‘‘కొలంబియా విశ్వవిద్యాలయం తరగతి గదులను మూసివేసింది. మిగిలిన సెమిస్టర్‌కు హైబ్రీడ్‌ పద్దతిని అనుసరించనుంది. కళాశాలల్లో పాలస్తీనాకు అనుకూలంగా ఆందోళన చేస్తున్న డజన్ల కొద్దీ విద్యార్థులను యేల్‌ పోలీసులు అరెస్టు చేశారు’’ అని వాషింగ్టన్‌ పోస్టు పత్రిక పేర్కొంది. ‘‘యుద్ధానికి వ్యతిరేకంగా చాలా కళాశాలల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. విశ్వవిద్యాలయాల రోజువారీ కార్యకలాపాలకు విద్యార్థులు ఆటంకం కలిగిస్తున్నారు’’ అని ఆ పత్రిక పేర్కొంది. న్యూయార్క్‌ యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల ప్రదర్శనలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని, పలువురు విద్యార్థులను అరెస్టుచేశారని న్యూయార్క్‌ టైమ్స్‌ తెలిపింది. కాలిఫోర్నియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల విద్యార్థులు 15 గుడారాలను ఏర్పాటు చేశారు. విద్యార్థుల ఆందోళనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో ఓ భారతీయ విద్యార్థి.. ‘స్వాతంత్య్రం తీసుకొనే తీరతాం’ అంటూ కొన్నేళ్ల క్రితం కొన్ని భారతీయ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు చేసిన నినాదాన్ని వినిపించారు. ఈ ఆందోళనలను శ్వేతసౌధం ఖండించింది. తరగతులు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని కొలంబియా యూనివర్సిటీ ప్రెసిడెంట్‌ తెలిపారు. సోమవారం విద్యార్థులతో పాటు. ప్రొఫెసర్లు కూడా పాలస్తీనా అనుకూల ప్రదర్శనల్లో పాల్గొన్నారు. కొలంబియా యూనివర్సిటీలో జరిగిన అరెస్టులకు నిరసనగా, బోస్టన్‌, హార్వర్డ్‌, మసాచుసెట్స్‌ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు తరగతులు బహిష్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని