అంతరిక్షంలోకి సాధారణ పౌరులు

అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది.

Updated : 24 Apr 2024 06:22 IST

రోదసి కార్యక్రమాలు లేని దేశాలకు అవకాశం
చేతులు కలిపిన సెరా, బ్లూ ఆరిజిన్‌

దిల్లీ: అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. ఇందుకోసం బ్లూ ఆరిజిన్‌ సంస్థతో చేతులు కలిపింది. అంతరిక్ష పర్యాటకం కోసం బ్లూ ఆరిజిన్‌ రూపొందించిన ‘న్యూ షెపర్డ్‌’ వ్యోమనౌకలో ఈ యాత్ర జరుగుతుంది. భవిష్యత్‌లో చేపట్టబోయే మొదటి ప్రయాణం కోసం వ్యోమనౌకలోని మొత్తం ఆరు సీట్లను.. సెరా కోసం రిజర్వు చేశారు. ప్రపంచవ్యాప్తంగా సాధారణ పౌరులకూ వ్యోమగాములుగా ఎదిగే అవకాశాన్ని కల్పించేందుకు ఈ ప్రాజెక్టును సెరా చేపట్టింది. ‘‘దాదాపు 150 దేశాలకు వ్యోమగాములు లేరు. ఈ పరిస్థితిని మార్చడం మా ఉద్దేశం’’ అని సెరా సహ వ్యవస్థాపకుడు జాషువా స్కుర్లా తెలిపారు. 2022లో బ్రెజిల్‌కు చెందిన సివిల్‌ ఇంజినీరు విక్టర్‌ హెస్పాన్హాను ఎంపిక చేసి, బ్లూ ఆరిజిన్‌ వ్యోమనౌక ద్వారా రోదసిలోకి పంపామని చెప్పారు. బ్రెజిల్‌ తరఫున రోదసిలోకి వెళ్లిన రెండో వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారన్నారు. ‘‘అంతరిక్ష రంగంలో ఉన్న అవకాశాలపై ఒక దేశం మొత్తాన్నీ ఒక వ్యక్తి ఎలా ప్రభావితం చేయగలరన్నది విక్టర్‌ యాత్ర ద్వారా మాకు తెలిసింది’’ అని చెప్పారు. భవిష్యత్‌లో అంతరిక్షంలో మానవ జీవనం.. పుడమిపైనున్న వైవిధ్యాన్ని ప్రతిబింబించాలని న్యూ షెపర్డ్‌ బిజినెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఫిల్‌ జాయ్స్‌ తెలిపారు. వ్యోమనౌకలో రిజర్వు చేసిన ఆరు సీట్లలో ఐదింటిని.. ఒక్క వ్యోమగామి కూడా లేని లేదా అతికొద్ది మంది మాత్రమే కలిగిన దేశాలకు కేటాయిస్తారు. ఆరో సీటును ఏ దేశానికి చెందిన వ్యక్తి అయినా ఆశించొచ్చు. ప్రతి దేశానికీ అంతరిక్ష సంస్థ ఉండేలా చూడటం తమ ఉద్దేశమని సెరా చెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని