దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!

సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది.

Published : 24 Apr 2024 05:30 IST

దిల్లీ: సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. ధూమపానం, తోడ్పాటు వ్యవస్థలు సరిగా లేకపోవడం, విద్య, ఆదాయం అంతంతమాత్రంగా ఉండటం వంటివి కూడా తోడైతే.. ఈ ముప్పు ఏడు రెట్లు పెరుగుతుందని తెలిపింది. బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. శరీరానికి గాయమయ్యాక మూడు నెలల కన్నా ఎక్కువ కాలం పాటు నొప్పి కొనసాగితే దాన్ని దీర్ఘకాల నొప్పిగా పరిగణిస్తారు. ఇలాంటివారి జీవన నాణ్యత తక్కువగా ఉంటుంది. వారు గుండె జబ్బు, మధుమేహం బారినపడే అవకాశం కూడా ఎక్కువ. ప్రస్తుతం.. దీర్ఘకాల నొప్పికి చికిత్స కోసం.. గాయమైన భాగంపైనే దృష్టిపెడుతున్నారని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే స్వస్థత కోసం మూడు నెలల కన్నా ఎక్కువ సమయాన్ని శరీరం తీసుకుంటోందంటే.. దీనికి మూల కారణాలు సంక్లిష్టమైనవని స్పష్టమవుతోందన్నారు. ‘‘దీర్ఘకాల నొప్పి ఉద్దేశం.. శరీరానికి హాని కలగకుండా రక్షించేలా ఆ వ్యక్తి వ్యవహారశైలిని మార్చడమే. గాయం మానాక కూడా సంబంధిత  నాడీ వ్యవస్థ మనకు ఆ అనుభవాన్ని కొనసాగించడం వల్ల దీర్ఘకాల నొప్పి తగ్గదు’’ అని పరిశోధనకు నాయకత్వం వహించిన మైఖేల్‌ డన్‌ తెలిపారు. గాయం నయమయ్యే ప్రక్రియపై మానసిక, సామాజిక అంశాలు అనేకం ప్రభావం చూపుతాయని చెప్పారు. అందువల్ల గాయపడిన భాగంపైనే పూర్తిగా దృష్టి పెట్టే చికిత్స ఒక్కోసారి ఆశించిన ఫలితాన్ని ఇవ్వదని తెలిపారు. దీర్ఘకాల నొప్పి ఉత్పన్నం కావడానికి ప్రభావం చూపే అంశాలు.. గాయం రకాన్ని బట్టి కాకుండా సంబంధిత వ్యక్తికి ఎదురైన నొప్పి అనుభవాలను బట్టి ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అందువల్ల ఎముకలు, కండరాల గాయాలకు చేసే చికిత్స.. ఆ వ్యక్తి కేంద్రంగా ఉండాలని పేర్కొన్నారు. విస్తృత జీవ, మానసిక, సామాజిక సాంత్వనపై కూడా దృష్టి సారించాలన్నారు. ఉద్యోగంలో సంతృప్తి లేకపోవడం, ఒత్తిడి, కుంగుబాటు వంటివి కూడా దీర్ఘకాల నొప్పికి దారితీస్తాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని