గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ

గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్‌ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు.

Updated : 24 Apr 2024 06:20 IST

దిల్లీ: గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్‌ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇది దాదాపు అరగంట ముందు ఈ పోకడను పసిగడుతుంది. హృదయ స్పందన.. సాధారణ స్థాయి నుంచి ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌కు మారే దశను ఈ ఏఐ నమూనా 80 శాతం కచ్చితత్వంతో గుర్తిస్తుంది. ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌ అనేది చాలా సర్వసాధారణంగా కనిపించే కార్డియాక్‌ అరిత్మియా. ఇందులో గుండె ఎగువ గదులు కొట్టుకునే రేటు హెచ్చుతగ్గులకు లోనవుతుంది. దిగువ గదులతో దీనికి లయ తప్పుతుంది. ఇలాంటి సందర్భాల్లో తమ ఏఐ నమూనా ముందస్తు హెచ్చరికలు చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనివల్ల బాధితులు.. నివారణ చర్యలు తీసుకొని, హృదయ స్పందనను స్థిరంగా ఉంచుకోవడానికి వీలవుతుందని చెప్పారు. ఏఐ వ్యవస్థ తయారీ కోసం.. చైనాలోని వుహాన్‌లో ఉన్న టోంగ్జి ఆసుపత్రిలో 350 మంది రోగుల నుంచి 24 గంటల పాటు డేటాను శాస్త్రవేత్తలు సేకరించారు. దాని ఆధారంగా ఏఐ నమూనాకు శిక్షణ ఇచ్చారు. దీనికి ‘వార్న్‌’ అని పేరు పెట్టారు. ఇది డీప్‌ లెర్నింగ్‌ ఆధారంగా రూపొందింది. పాత డేటాలోని నిర్దిష్ట పోకడలను ఆధారంగా చేసుకొని అంచనాలు వేయడం దీని ప్రత్యేకత. దీన్ని స్మార్ట్‌ఫోన్లలో ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది స్మార్ట్‌వాచ్‌లలో నమోదయ్యే డేటాను విశ్లేషిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని