జీపీఎస్‌ జామ్‌.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?

బాల్టిక్‌ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్‌ జామ్‌ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

Updated : 24 Apr 2024 06:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాల్టిక్‌ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్‌ జామ్‌ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీని వెనక రష్యా రహస్య ఆయుధం ఉండొచ్చని తాజా కథనం పేర్కొంది. దాని పేరు టోబోల్‌. గతంలో నాటో తూర్పు ప్రాంతంలో నౌకల సిగ్నల్స్‌ను అడ్డుకునేందుకు ఈ సాంకేతిక ఆయుధాన్ని మాస్కో ఉపయోగించినట్లు సమాచారం. లిథువేనియా-పోలండ్‌ మధ్యలోని కాలినిన్‌గ్రాడ్‌లోని రష్యా సైనిక స్థావరం కేంద్రంగా ఈ సాంకేతికత పనిచేస్తున్నట్లు ‘ది సన్‌’ కథనం వెల్లడించింది. ఇందుకు సంబంధించి సైనిక స్థావరం వద్ద భారీ పరిమాణంలో ఉన్న శాటిలైట్‌ డిష్‌ల చిత్రాలను ఉదహరించింది. ఇవన్నీ టోబోల్‌లో భాగమేనని పేర్కొంది. రష్యా వ్యాప్తంగా ఇటువంటివి పది పరికరాలు ఉన్నాయని తెలిపింది.

శాటిలైట్‌ సిగ్నల్స్‌ను అడ్డుకోవడం ద్వారా నాటో క్షిపణులకు తమ స్థావరాలు లక్ష్యంగా మారకుండా ఉండేందుకే మాస్కో ఈ వ్యవస్థను వినియోగించుకున్నట్లు సమాచారం. ఇది రెండు విధాలుగా పని చేస్తుందని వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం పేర్కొంది. ఆకాశంలో శాటిలైట్లను నేరుగా లక్ష్యం చేసుకోవడం ఒకటి. ఈ తరహా జామింగ్‌ ద్వారా వాస్తవ సిగ్నల్స్‌ను ఏమార్చి.. ఆ శాటిలైట్‌ నుంచి వినియోగదారులకు వెళ్లే సమాచారాన్ని వక్రీకరిస్తుందని బార్డ్‌ హెండ్రిక్‌ అనే పరిశోధకుడు పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో నాటో ప్రాంతంలో జీపీఎస్‌ అంతరాయానికి టోబోల్‌ కారణమని ఎస్తోనియాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ పరిణామాలు రష్యా చర్యలు లేదా హైబ్రిడ్‌ యుద్ధక్షేత్రంలో భాగమేనని స్వీడన్‌ లెఫ్టినెంట్‌ కర్నల్‌ జోవాకిమ్‌ పాసికివీ అభిప్రాయపడ్డారు.

ఉక్రెయిన్‌ యుద్ధంలో ప్రయోగాలు..

ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్‌ ప్రసారాలకు అంతరాయం కలిగించేందుకు రష్యా ఈ ప్రయోగాలు చేసినట్లు అమెరికా మీడియా పేర్కొంది. ఈ సాంకేతికత ద్వారానే బాల్టిక్‌ సముద్రమార్గంలో వెళ్లే వేలాది వాణిజ్య విమానాలు సిగ్నల్‌ సమస్యను ఎదుర్కొన్నాయని, వాటిని నేవిగేట్‌ చేయడం కష్టంగా మారినట్లు నిపుణులు అంచనా వేశారు. ముఖ్యంగా ఫిన్లాండ్‌, పోలండ్‌, స్వీడన్‌ దేశాల్లో కొన్ని నెలలుగా ఈతరహా జీపీఎస్‌ ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అయితే, ఈ ‘టోబోల్‌’పై అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని