రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!

చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది.

Published : 25 Apr 2024 04:44 IST

నేడు పయనం
మానవసహిత జాబిల్లి యాత్ర దిశగా డ్రాగన్‌ అడుగులు

జియుక్వాన్‌: చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. షెంఝౌ-18 వ్యోమనౌక ద్వారా గురువారం ఈ యాత్ర చేపట్టనుంది. ఇందుకోసం తుది కసరత్తు చేపడుతోంది. రోదసిలోకి వెళ్లే వ్యోమగాములు యె గువాంగ్‌ఫు, లీ కాంగ్‌, లీ గువాంగ్సులను బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో పరిచయం చేసింది. వీరిలో కాంగ్‌, గువాంగ్సులకు ఇది తొలి యాత్ర. గోబీ ఎడారిలోని జియుక్వాన్‌ ఉపగ్రహ కేంద్రం నుంచి వీరు రోదసిలోకి పయనమవుతారు. భూకక్ష్యలోని తియాంగాంగ్‌ అంతరిక్ష కేంద్రంలో ఆరు నెలలు బస చేస్తారు. గత అక్టోబరు నుంచి అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు వ్యోమగాములు భూమికి తిరిగొస్తారు. తాజాగా రోదసిలోకి వెళ్లే వ్యోమగాములు శాస్త్రీయ పరిశోధనలు చేపడతారు. అంతరిక్ష వ్యర్థాల నుంచి రక్షణ కల్పించే సాధనాలను తియాంగాంగ్‌ రోదసి కేంద్రానికి అమరుస్తారు. సైన్స్‌ విద్యకు ఆదరణ కల్పించే కసరత్తును చేపడతారు. తన అంతరిక్ష కేంద్రంలోకి విదేశీ వ్యోమగాములు, అంతరిక్ష పర్యాటకులకు అనుమతిచ్చేందుకు కూడా చైనా కసరత్తు చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు