కశ్మీర్‌ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి

కశ్మీర్‌ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్‌, ఇరాన్‌లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి.

Published : 25 Apr 2024 04:45 IST

పాకిస్థాన్‌-ఇరాన్‌ ఉమ్మడి ప్రకటనలో వెల్లడి

ఇస్లామాబాద్‌, వాషింగ్టన్‌: కశ్మీర్‌ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్‌, ఇరాన్‌లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. ‘‘కశ్మీర్‌ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా శాంతియుత మార్గాలు, చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరాన్ని ఇరు పక్షాలు నొక్కి  చెప్పాయి’’ అని వెల్లడించాయి. ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ పాక్‌ మూడ్రోజుల పర్యటన ముగిసిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఫిబ్రవరి 8న పాక్‌లో ఎన్నికలు జరిగిన తర్వాత ఆ దేశంలో పర్యటించిన తొలి దేశాధినేత ఇబ్రహీం రైసీ కావడం గమనార్హం. ఉగ్రవాదంపై పోరాటానికి ఉమ్మడి వేదికను ఏర్పాటుచేయాల్సిన అవసరాన్ని గుర్తించినట్లు ఈ సందర్భంగా రెండు దేశాలు ప్రకటించాయి. ప్రాంతీయ శాంతికి, సుస్థిరతకు ఉగ్రవాదం ఉమ్మడి ముప్పుగా పరిణమించిందని, ఈ ప్రాంత అభివృద్ధికి పెద్ద ఆటంకంగా మారిందని పేర్కొన్నాయి. ఈ విపత్తును ఎదుర్కొనేందుకు సహకార విధానాన్ని అవలంబించాలని నిర్ణయించాయి.


ఇరాన్‌తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటే ఆంక్షలే

-అమెరికా

ఇరాన్‌తో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునే ఏ దేశానికైనా ఆంక్షల ప్రమాదం పొంచి ఉన్నట్లేనని అమెరికా బుధవారం హెచ్చరించింది. పాక్‌ పర్యటనకు వచ్చిన ఇరాన్‌ అధ్యక్షుడు ఆ దేశంతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్న నేపథ్యంలో అమెరికా ఈ హెచ్చరిక చేయడం గమనార్హం.  మరోవైపు, పెంటగాన్‌ మీడియా కార్యదర్శి ప్యాట్‌ రైడర్‌ మాట్లాడుతూ.. ‘‘పాక్‌తో అమెరికా సత్సంబంధాలు కొనసాగిస్తోంది. ఆ ప్రాంతంలో వారు మాకు కీలక భద్రతా భాగస్వామి’’ అని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని