వారానికి 24 గంటలే పని

కెనడాలో చదువుకుంటున్న భారత్‌ సహా అంతర్జాతీయ విద్యార్థులు సెప్టెంబరు నెల నుంచి విద్యాసంస్థ ప్రాంగణం వెలుపల వారానికి 24 గంటలు మాత్రమే పనిచేసుకునేందుకు వీలు కల్పించే కొత్త నిబంధన ఒకటి మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది.

Updated : 01 May 2024 07:47 IST

కెనడాలో విదేశీ విద్యార్థులకు సంబంధించి అమల్లోకి కొత్త నిబంధన

ఒట్టావా: కెనడాలో చదువుకుంటున్న భారత్‌ సహా అంతర్జాతీయ విద్యార్థులు సెప్టెంబరు నెల నుంచి విద్యాసంస్థ ప్రాంగణం వెలుపల వారానికి 24 గంటలు మాత్రమే పనిచేసుకునేందుకు వీలు కల్పించే కొత్త నిబంధన ఒకటి మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. ‘‘విద్యాసంస్థ ప్రాంగణం వెలుపల 20 గంటలకుపైగా పని చేసుకునే ప్రస్తుత తాత్కాలిక విధానం ఏప్రిల్‌ 30తో ముగుస్తుంది. దాన్ని పొడిగించడానికి బదులు వారానికి 24 గంటలకు పరిమితం చేస్తున్నాం’’ అని కెనడా వలసలు, శరణార్థులు, పౌరసత్వ వ్యవహారాల శాఖ మంత్రి మార్క్‌ మిల్లర్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కెనడాకు వచ్చే అంతర్జాతీయ విద్యార్థులకు వారానికి 20 గంటలు పని చేసుకునే అవకాశం ఉండేది. కొవిడ్‌ -19 మహమ్మారి విజృంభణ సమయంలో దేశంలో నెలకొన్న కార్మికుల కొరతను పరిష్కరించేందుకు ట్రూడో ప్రభుత్వం నిబంధనలు సడలించింది. వారానికి గరిష్ఠంగా 40 గంటలు పని చేసుకొనే వీలు కల్పించింది. ఈ వెసులుబాటు ఏప్రిల్‌-2024తో ముగిసింది. కొత్త పని గంటల విధానం మాత్రం సెప్టెంబరు నుంచి అమల్లోకి వస్తుంది. విదేశీ విద్య కోసం చూసే భారత యువతకు కెనడా ప్రధాన గమ్యస్థానంగా ఉంటోంది. 2022లో కెనడా ప్రభుత్వ గణాంకాల ప్రకారం..ఆ దేశంలో 3,19,130 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు.  


చదువులో వెనకబడిపోతున్నారు..

వారానికి 28 గంటల కంటే ఎక్కువ పనిచేసే విదేశీ విద్యార్థులు.. చదువులో వెనకబడిపోతున్నట్లు అమెరికా, కెనడాలో ఇటీవల నిర్వహించిన అధ్యయనాల్లో తేలినట్లు జస్టిన్‌ ట్రూడో ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా వారానికి 24 గంటల కంటే ఎక్కువ సమయం పనిచేసే విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపివేసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని