కిడ్నాప్‌ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి

యువకుడిని కిడ్నాప్‌ చేసి.. అతడి ఇంటికి కేవలం 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. ఎట్టకేలకు ఓ సోషల్‌ మీడియా పోస్టు ఆధారంగా బాధితుడిని రక్షించారు.

Updated : 18 May 2024 05:23 IST

అల్జీరియాలో వెలుగుచూసిన దారుణం

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువకుడిని కిడ్నాప్‌ చేసి.. అతడి ఇంటికి కేవలం 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. ఎట్టకేలకు ఓ సోషల్‌ మీడియా పోస్టు ఆధారంగా బాధితుడిని రక్షించారు. ఈ ఘటన అల్జీరియాలో చోటు చేసుకొంది. ఉత్తర అల్జీరియాలోని డెజెల్ఫా అనే ఊళ్లో 1998లో ఒమర్‌ బిన్‌ ఒమ్రాన్‌ అనే 19 ఏళ్ల యువకుడు కిడ్నాప్‌ అయ్యాడు. ఆ సమయంలో కుటుంబసభ్యులు అతడి ఆచూకీ కనుగొనేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కేసు కూడా పెట్టినా.. అతడి జాడ లభించలేదు. ఓ రోజు ఒమ్రాన్‌ పెంపుడు శునకం పొరుగింటి వద్ద వాసన చూస్తూ తిరిగింది. దీనిని ఆ కుటుంబ సభ్యులు తేలిగ్గా తీసుకున్నారు. అనంతరం ఆ మూగజీవం హఠాత్తుగా చనిపోయింది. ఇక అప్పటికే దేశంలో తీవ్రమైన అంతర్యుద్ధం జరుగుతుండడంతో.. ఒమ్రాన్‌ కుటుంబం ఆశలు వదులుకుంది. అలా 26 ఏళ్లు గడిచిపోయాయి. అతడి కోసం ఎదురు చూసిన తల్లి 2013లో చనిపోయారు. ఇటీవల కిడ్నాపర్‌కు సోదరుడి వరుస అయ్యే వ్యక్తి సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. తన సోదరుడు ఓ కిడ్నాప్‌ చేశాడని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఒమ్రాన్‌ కుటుంబం గ్రహించి వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో అధికారులు పొరుగింటిపై దాడి చేసి.. గాలింపు చేపట్టారు. అక్కడే ఉన్న గొర్రెల కొట్టం కింద ఓ సెల్లార్‌ ఉన్నట్లు గ్రహించారు. అందులోకి వెళ్లి చూడగా ఒమ్రాన్‌ కనిపించాడు. అధికారులు అతడిని రక్షించారు. తాను దాదాపు 26 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నట్లు చెప్పాడు. అప్పుడప్పుడూ తన కుటుంబ సభ్యులు ఆ దారిలో వెళుతుంటే చూసేవాడినని.. కానీ, గట్టిగా అరిచి పిలుద్దామంటే.. పక్కనే కిడ్నాపర్‌ ఉండేవాడని వెల్లడించాడు. ఇక దర్యాప్తు అధికారులు 64 ఏళ్ల వయసున్న కిడ్నాపర్‌ పారిపోతుండగా అరెస్టు చేశారు. ఒమ్రాన్‌ పెంపుడు శునకం ఇంటి వద్ద వాసన చూసినప్పుడు.. ఎవరైనా అనుమానిస్తారని భావించి.. కిడ్నాపరే దానిని చంపేసినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని