అధ్యక్ష పదవికి భారతీయ అమెరికన్‌ పోటీ!

పాలక డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు రో ఖన్నా (47) మున్ముందు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం ఉందని ఆయన సహచరులు భావిస్తున్నారు.

Published : 18 May 2024 06:05 IST

రో ఖన్నా పేరుపై సానుకూల స్పందనలు

వాషింగ్టన్‌: పాలక డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు రో ఖన్నా (47) మున్ముందు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం ఉందని ఆయన సహచరులు భావిస్తున్నారు. వాషింగ్టన్‌లో గురువారం ఇండియన్‌ అమెరికన్‌ ఇంపాక్ట్‌ చర్చా వేదికలో ఏబీసీ విలేకరి జోహ్రీన్‌ షా భారత సంతతి అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యులను.. రో ఖన్నా అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేసే విషయమై ఆరా తీయగా... ‘అవును, అవున’ంటూ ఠాణేదార్, ప్రమీలా జయపాల్‌ వ్యాఖ్యానించారు. సిలికాన్‌ వ్యాలీ నుంచి అమెరికా పార్లమెంటుకు ఎన్నికైన రో ఖన్నా.. ‘ఏమో ఎలా చెప్పగలం’ అని అంటూనే.... బహుశా ఒక దశాబ్ద కాలంలో అధ్యక్ష పదవికి పోటీ చేయవచ్చునని స్పందించారు. ఆయనకు తోడు చర్చలో పాల్గొన్న ముగ్గురు భారతీయ అమెరికన్‌ సభ్యులు కూడా సానుకూలమైన స్పందననే కనబరిచారు.

‘హక్కులపై భారత్‌కు పాఠాలు వద్దు’

 మానవ హక్కుల గురించి భారత దేశానికి ధర్మోపదేశాల వల్ల ఉపయోగం ఉండదనీ, దీనికి బదులు ఆ దేశ నాయకత్వంతో నేరుగా చర్చలు జరపడం ఎక్కువ ప్రయోజనకరమని భారతీయ అమెరికన్‌ పార్లమెంటు సభ్యులు అగ్రరాజ్య ప్రభుత్వానికి సూచించారు. నూరేళ్లపాటు వలస పాలనలో ఉన్న భారతదేశం ఇతర దేశాలు తనకు ఉపదేశాలు ఇవ్వడాన్ని అంగీకరించదని రో ఖన్నా వ్యాఖ్యానించారు. ఆయనతోపాటు శ్రీ ఠాణేదార్, ప్రమీలా జయపాల్, డాక్టర్‌ అమీ బేరా కూడా ఈ అంశంపై మాట్లాడారు. వీరంతా పాలక డెమోక్రటిక్‌ పార్టీకి చెందినవారే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని