ఖర్కీవ్‌ను ఆక్రమించే ప్రణాళికల్లేవ్‌

ఈశాన్య ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్‌ ప్రాంతంలో బఫర్‌ జోన్‌ ఏర్పాటే అక్కడ తమ తాజా దాడుల లక్ష్యమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అన్నారు.

Updated : 18 May 2024 06:04 IST

బఫర్‌ జోన్‌ మాత్రమే ఏర్పాటు చేయాలనుకుంటున్నాం
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ స్పష్టీకరణ

కీవ్‌: ఈశాన్య ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్‌ ప్రాంతంలో బఫర్‌ జోన్‌ ఏర్పాటే అక్కడ తమ తాజా దాడుల లక్ష్యమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అన్నారు. ఆ ప్రాంతాన్ని ఆక్రమించే ప్రణాళికలేవీ తమకు లేవని స్పష్టం చేశారు. చైనాలోని హార్బిన్‌లో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. తమ దేశంలోని బెల్‌గొరోద్‌ ప్రాంతంపై ఉక్రెయిన్‌ ఇటీవల షెల్‌లతో విరుచుకుపడిన సంగతిని ఆయన గుర్తుచేశారు. దానికి బదులుగానే తాము ఖర్కీవ్‌పై ఈ నెల 10 నుంచి ఉద్ధృతంగా దాడులు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో మాస్కో బలగాలు ప్రణాళిక ప్రకారమే దూసుకెళ్తున్నాయని పేర్కొన్నారు. మరోవైపు- ఖర్కీవ్‌లోకి రష్యా సైనికులు 10 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు.

చైనాలో ముగిసిన పుతిన్‌ పర్యటన 

చైనాలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ రెండు రోజుల పర్యటన శుక్రవారంతో ముగిసింది. తన పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో ఆయన పలు అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సహకార భాగస్వామ్యాన్ని కొనసాగించుకోవడంపై దార్శనిక పత్రాన్ని విడుదల చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధానికి చర్చల ద్వారా ముగింపు పలికేందుకు తాము సిద్ధమేనని పుతిన్‌ పేర్కొన్నారు. అమెరికా నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ రష్యా-చైనా వ్యూహాత్మక సంబంధాలు ప్రస్తుతం చరిత్రాత్మక ఆరంభ కేంద్రం వద్ద ఉన్నాయని జిన్‌పింగ్‌ అన్నారు.

క్రిమియాపై డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్‌ 

క్రిమియాపై ఉక్రెయిన్‌ శుక్రవారం డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో సెవాస్టపొల్‌ నగరంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. దక్షిణ రష్యాలోని ఓ రిఫైనరీలోనూ డ్రోన్ల దాడి కారణంగా మంటలు చెలరేగాయి. తమ దేశ గగనతల రక్షణ బలగాలు క్రిమియాలో 51, క్రాస్నొదార్‌ ప్రాంతంలో 44, బొల్‌గొరోద్‌ ప్రాంతంపై ఆరు డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా ప్రకటించింది. నల్ల సముద్రంలో ఆరు సముద్రపు డ్రోన్లనూ ధ్వంసం చేశామని వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు