ఉత్తర గాజాలో హోరాహోరీ

గాజాలో ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య పోరు హోరాహోరీ సాగుతోంది. ముఖ్యంగా ఉత్తర గాజాలో జబాలియా కేంద్రంగా దాడులు, ప్రతిదాడులు భారీస్థాయిలో కొనసాగుతున్నాయి.

Published : 18 May 2024 04:53 IST

75 రాకెట్లతో హెజ్‌బొల్లా దాడి
ముగ్గురు ఇజ్రాయెల్‌ పౌరులు మృతి

జెరూసలెం: గాజాలో ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య పోరు హోరాహోరీ సాగుతోంది. ముఖ్యంగా ఉత్తర గాజాలో జబాలియా కేంద్రంగా దాడులు, ప్రతిదాడులు భారీస్థాయిలో కొనసాగుతున్నాయి. ఓ ఇజ్రాయెలీ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో టెల్‌ అవీవ్‌ గగనతలదాడులు ప్రారంభించింది. మరోవైపు లెబనాన్‌ నుంచీ ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా ఉగ్రవాదులు ఒత్తిడి పెంచుతున్నారు. శుక్రవారం ఏకంగా 75 రాకెట్లు ప్రయోగించారు. ఈ దాడుల్లో ముగ్గురు పౌరులు మృతి చెందారు. హమాస్‌ చెరలోని ముగ్గురు బందీల మృత దేహాలు గాజాలో లభ్యమయ్యాయని శుక్రవారం ఇజ్రాయెల్‌ రక్షణ దళాలు (ఐడీఎఫ్‌) ప్రకటించాయి. గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌లోని సూపర్‌ నోవా మ్యూజిక్‌ ఫెస్టివల్‌ కార్యక్రమంపై హమాస్‌ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఈ ముగ్గురిని హమాస్‌ మిలిటెంట్లు కాల్చి చంపారని.. అనంతరం వారి మృత దేహాలను గాజాకు తరలించారని ఐడీఎఫ్‌ ప్రతినిధి రియర్‌ అడ్మిరల్‌ డానియల్‌ హగారి తెలిపారు. 

భారత్‌కు చేరిన కాలె భౌతికకాయం

దిల్లీ: గాజాలో మృతి చెందిన భారత మాజీ సైన్యాధికారి వైభవ్‌ అనిల్‌ కాలె(46) భౌతిక కాయం శుక్రవారం భారత్‌ చేరుకుంది. ఆయన మృతదేహానికి పూర్తి అధికారిక లాంఛనాలతో పుణెలో అంత్యక్రియలు నిర్వహించారు. గతంలో సైన్యంలో వివిధ హోదాల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన కాలె.. రెండు నెలల క్రితం ఐక్యరాజ్యసమితి భద్రత, రక్షణ విభాగంలో చేరారు. ఆ విధుల్లో భాగంగా రఫాలోని ఓ ఆసుపత్రిలో పరిస్థితిని సమీక్షించడానికి ఐరాస జెండా ఉన్న వాహనంతో వెళుతున్న సమయంలో ఆయనపై దాడి జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని