2050 నాటికి పెరగనున్న ఆయుర్దాయం

ప్రపంచవ్యాప్తంగా 2022 నుంచి 2050 మధ్య ఆయుర్దాయం పురుషుల్లో 5 సంవత్సరాలు, మహిళల్లో 4 ఏళ్లు పెరుగుతుందని  లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం అంచనా వేసింది.

Published : 18 May 2024 04:54 IST

లాన్సెట్‌ అధ్యయనం వెల్లడి 

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 2022 నుంచి 2050 మధ్య ఆయుర్దాయం పురుషుల్లో 5 సంవత్సరాలు, మహిళల్లో 4 ఏళ్లు పెరుగుతుందని  లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం అంచనా వేసింది. ఆయుర్దాయం తక్కువగా ఉన్న దేశాల్లో ఈ పెరుగుదల అత్యధికంగా ఉంటుందని.. తద్వారా మొత్తం ఆయుర్దాయం పెరగడానికి దోహదపడుతుందని పరిశోధకులు తెలిపారు. అనేక రోగాల బారి నుంచి కాపాడటానికి చేపడుతున్న ప్రజారోగ్య చర్యలు ఫలితాలనివ్వడం కూడా ఈ పెరుగుదలకు కారణమని వారు చెప్పారు. మొత్తంగా మనుషుల జీవనకాలం పెరగడంతోపాటు కొన్ని భౌగోళిక ప్రాంతాలలో ఆయుర్దాయం అసమానత తగ్గుతుందని కనుగొన్నట్లు వాషింగ్టన్‌ యూనివర్సిటీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఇవాల్యుయేషన్‌(ఐహెచ్‌ఎమ్‌ఈ) డైరెక్టర్‌ క్రిస్‌ ముర్రే తెలిపారు. అధిక, అత్యల్ప ఆదాయ ప్రాంతాల మధ్య అసమానతలు కొనసాగుతుండగా.. అంతరాలు తగ్గుతున్నాయని ముర్రే పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యంగా జీవించే ఆయుర్దాయం 2.6 సంవత్సరాలు పెరుగుతుందని, 2022లో 64.8 ఉండగా 2050లో 67.4 సంవత్సరాలకు చేరుతుందని తెలిపారు. ఈ అధ్యయనం ప్రకారం 2050 నాటికి భారత్‌లో పురుషుల సగటు ఆయుర్దాయం 75, మహిళల విషయంలో 80 ఏళ్లు ఉంటుంది. భారత్‌లో ఆరోగ్యంగా జీవించే ఆయుర్దాయం పురుషులు, మహిళల్లో 65 ఏళ్లకంటే ఎక్కువగా ఉంటుందని అధ్యయనం అంచనా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని