కిర్గిజ్‌స్థాన్లో విదేశీ విద్యార్థులపై మూకదాడులు

కిర్గిజ్‌స్థాన్‌లోని భారత విద్యార్థులను కేంద్రం అప్రమత్తం చేసింది. రాజధాని బిష్‌కెక్‌లో విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని మూక హింస చెలరేగడంతో.. ఎవరూ బయటకు రావొద్దని సూచించింది.

Published : 19 May 2024 03:16 IST

 భయాందోళనలో భారతీయులు 

దిల్లీ: కిర్గిజ్‌స్థాన్‌లోని భారత విద్యార్థులను కేంద్రం అప్రమత్తం చేసింది. రాజధాని బిష్‌కెక్‌లో విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని మూక హింస చెలరేగడంతో.. ఎవరూ బయటకు రావొద్దని సూచించింది.  ‘‘మన విద్యార్థుల గురించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. ప్రస్తుతానికి పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నప్పటికీ, విద్యార్థులు బయటకు రావొద్దు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఎంబసీని సంప్రదించాలి’’ అంటూ 24 గంటలు అందుబాటులో ఉండే ఒక ఫోన్‌ నంబర్‌ (0555710041)ను భారత రాయబార కార్యాలయం ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు చేసింది. కిర్గిజ్‌స్థాన్, ఈజిప్ట్‌కు చెందిన విద్యార్థుల మధ్య ఈ నెల 13న జరిగిన ఘర్షణకు సంబంధించి వీడియోలు వైరల్‌ కావడం దాడులకు దారితీసిందని తెలిపింది. పాకిస్థాన్, భారత్, బంగ్లాదేశ్‌ దేశాలకు చెందిన విద్యార్థులు ఉంటున్న వసతి గృహాలను స్థానికులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ దాడుల్లో ఎక్కువ మంది పాకిస్థానీ విద్యార్థులు గాయపడ్డారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ అల్లర్లపై స్పందించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు. కిర్గిజ్‌స్థాన్‌లో సుమారు 15 వేల మంది భారత విద్యార్థులు వివిధ విశ్వవిద్యాలయాల్లో ఉన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని