బ్రిటన్‌ రాజు చార్లెస్‌-3 ఆస్తుల కంటే రిషి సునాక్‌ దంపతుల సంపదే ఎక్కువ

బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన సతీమణి అక్షతామూర్తిల ఆస్తులు ఇటీవల గణనీయంగా పెరిగినట్లు ఓ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే.

Updated : 20 May 2024 06:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన సతీమణి అక్షతామూర్తిల ఆస్తులు ఇటీవల గణనీయంగా పెరిగినట్లు ఓ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. వీరి ఆస్తులు బ్రిటన్‌ రాజు చార్లెస్‌-3 కంటే ఎక్కువని తేలింది. రెండేళ్ల క్రితం సండే టైమ్స్‌ సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్న సునాక్‌ దంపతులు.. గతేడాది 275వ స్థానంలో నిలిచారు. తాజా జాబితాలో వీరు 245వ స్థానంలో నిలవగా.. కింగ్‌ చార్లెస్‌-3 మాత్రం 258వ స్థానంలో ఉండడం గమనార్హం. బ్రిటన్‌లో నివసిస్తోన్న తొలి వెయ్యి మంది సంపన్నులు/కుటుంబాల సంపదను అంచనా వేస్తూ సండే టైమ్స్‌ తాజా జాబితా విడుదల చేసింది. ఇందులో కింగ్‌ చార్లెస్‌-3 సంపద గత ఏడాది కాలంలో 600 మిలియన్‌ పౌండ్ల నుంచి 610 మిలియన్‌ పౌండ్లకు చేరుకుంది. సునాక్‌ దంపతుల సంపద మాత్రం 529 మిలియన్‌ పౌండ్ల నుంచి 651 మిలియన్‌ పౌండ్లకు పెరిగింది. అయితే, రాజ కుటుంబ సంపదను కచ్చితంగా అంచనా వేయడం కష్టమేనని తాజా నివేదిక వెల్లడించింది. వారికి ఎన్నో ఎస్టేట్‌లు, ప్యాలెస్‌లు ఉన్నాయని.. వాటి విలువ కొన్ని బిలియన్‌ పౌండ్లుగా ఉంటుందని అంచనా. సునాక్‌ దంపతుల మొత్తం సంపద ఏడాది కాలంలోనే 120 మిలియన్‌ పౌండ్లు పెరిగినట్లు తాజా నివేదిక వెల్లడించింది. 2022-23లో రిషి సునాక్‌ సుమారు రూ.23 కోట్లు (2.2 మిలియన్‌ పౌండ్లు) సంపాదించగా, ఆయన సతీమణి అక్షతామూర్తి డివిడెంట్ల రూపంలో ఏకంగా రూ.137 కోట్లు (13 మిలియన్‌ పౌండ్లు) అందుకున్నారు. వీరి ఆస్తిలో సింహభాగం అక్షతామూర్తికి ఇన్ఫోసిస్‌లో ఉన్న షేర్లే కావడంతో ఇది గణనీయంగా పెరిగినట్లు కనిపిస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని