గాజాపై గగనతల దాడిలో 27 మంది మృతి

ఇజ్రాయెల్‌ జరిపిన గగనతల దాడిలో గాజాలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. నుసీరత్‌లో పాలస్తీనా శరణార్థి శిబిరంపై చోటుచేసుకున్న ఈ ఘటన మృతుల్లో 10 మంది మహిళలు, ఏడుగురు పిల్లలు ఉన్నారు.

Published : 20 May 2024 04:54 IST

ఇజ్రాయెల్‌ దాడి కారణంగా గాజాలోని నుసిరత్‌ ప్రాంతంలో ధ్వంసమైన పునరావాస శిబిరం

డెయిర్‌ అల్‌-బలా (గాజా స్ట్రిప్‌): ఇజ్రాయెల్‌ జరిపిన గగనతల దాడిలో గాజాలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. నుసీరత్‌లో పాలస్తీనా శరణార్థి శిబిరంపై చోటుచేసుకున్న ఈ ఘటన మృతుల్లో 10 మంది మహిళలు, ఏడుగురు పిల్లలు ఉన్నారు. ఇదే ప్రాంతంలో వీధిపై జరిగిన మరో దాడిలో ఐదుగురు చనిపోయారు. అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. వారం వ్యవధిలో కనీసం 150 మృతదేహాలు లభ్యమైనట్లు పౌర రక్షణ విభాగ ప్రతినిధి తెలిపారు. యుద్ధం తర్వాత గాజాను ఎవరు పాలించాలనే విషయంలో ఇజ్రాయెల్‌ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో హమాస్‌పై పోరు ముమ్మరంగా సాగుతోంది. ప్రతిష్టంభనను తొలగించడానికి ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుతో అమెరికా జాతీయ భద్రత సలహాదారుడు జేక్‌ సులివాన్‌ చర్చలు జరిపారు. అంతకుముందు సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌తోనూ ఆయన భేటీ అయ్యారు. కాల్పుల విరమణకు అంగీకారం తెలపకుండా యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగడానికి నెతన్యాహు కారణమని ఆరోపిస్తూ వేలసంఖ్యలో నిరసనకారులు ప్రదర్శనలు చేపట్టారు. హమాస్‌ను పూర్తిగా నాశనం చేసేవరకు, గాజాలో బందీలుగా ఉన్న వందమందిని విడిపించేవరకు దాడులు కొనసాగుతాయని, దీనిలో రాజకీయ ఉద్దేశాలేవీ లేవని నెతన్యాహు స్పష్టంచేస్తున్నారు. ఒకపక్క హమాస్‌ తన పోరాటాన్ని కొనసాగిస్తున్నప్పుడు యుద్ధానంతర ఏర్పాట్లపై చర్చలో అర్థంలేదని వ్యాఖ్యానించారు.

చమురు నౌకపై క్షిపణి దాడి 

దుబాయ్‌: యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో ఒక చమురు నౌకపై బాలిస్టిక్‌ క్షిపణితో దాడి చేశారు. పనామా పతాకంతో ఈ నౌక చైనాకు వెళ్తూ దాడిలో పాక్షికంగా దెబ్బతింది. అమెరికాకు చెందిన ఒక డ్రోన్‌ను యెమెన్‌ గగనతలంలో హూతీలు కూల్చివేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.


అమెరికాలో పాలస్తీనా అనుకూల ప్రదర్శన

వాషింగ్టన్‌: అమెరికా పార్లమెంటు భవన సమీపంలో వందలమంది పాలస్తీనా అనుకూల ప్రజలు ఆదివారం ప్రదర్శన నిర్వహించారు. ఇజ్రాయెల్‌కు, అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. గాజాలో ప్రస్తుత యుద్ధం, గతంలో 7 లక్షల మంది పాలస్తీనీయులు వలసపోవాల్సి రావడం వంటివి గుర్తుచేస్తూ ఆవేదన వ్యక్తపరిచారు. ఆగకుండా కురుస్తున్న వాననూ లెక్కచేయకుండా వారు ర్యాలీ కొనసాగించారు. గాజాలో ఇజ్రాయెల్‌ సైనిక కార్యకలాపాలకు వెంటనే ముగింపు పలకాలని, పాలస్తీనీయుల హక్కుల్ని కాపాడాలని డిమాండ్‌ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు