‘కలుషిత రక్తం’ కుంభకోణంపై రిషి సునాక్‌ క్షమాపణలు

బ్రిటన్‌లో 1970ల్లో చోటుచేసుకున్న కలుషిత రక్తం కుంభకోణాన్ని నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌) కప్పిపుచ్చినట్లు వచ్చిన ఆరోపణలకు సంబంధించి ప్రధానమంత్రి రిషి సునాక్‌ సోమవారం క్షమాపణలు తెలిపారు.

Updated : 21 May 2024 06:29 IST

లండన్‌: బ్రిటన్‌లో 1970ల్లో చోటుచేసుకున్న కలుషిత రక్తం కుంభకోణాన్ని నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌) కప్పిపుచ్చినట్లు వచ్చిన ఆరోపణలకు సంబంధించి ప్రధానమంత్రి రిషి సునాక్‌ సోమవారం క్షమాపణలు తెలిపారు. బ్రిటన్‌ చరిత్రలోనే సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజని వ్యాఖ్యానించారు. ‘‘ప్రస్తుత ప్రభుత్వంతోపాటు 1970ల నుంచి ఏర్పడిన అన్ని ప్రభుత్వాల తరఫున నేను క్షమాపణలు చెబుతున్నాను. బాధితులు లేదా వారి కుటుంబసభ్యులకు ఖర్చు ఎంతైనా సరే పరిహారం అందజేస్తాం’’ అని ఈ కుంభకోణం బాధితులు, వారి కుటుంబసభ్యులను ఉద్దేశించి ప్రతినిధుల సభలో మాట్లాడుతూ వెల్లడించారు. 

ఏమిటీ కుంభకోణం’?

రక్తం గడ్డకట్టే సామర్థ్యం లేని ‘హిమోఫిలియా’ వ్యాధి బాధితుల కోసం బ్రిటన్‌ ప్రభుత్వం 1970 దశకంలో కొత్త చికిత్సను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు సంబంధించి ఫ్యాక్టర్‌-8 పేరుతో రూపొందించిన రక్తాన్ని అమెరికా నుంచి నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ దిగుమతి చేసుకుంది. దీన్ని రక్తమార్పిడి అవసరమైన వేలాది మంది బాధితులకు అందించారు. ఫ్యాక్టర్‌ చికిత్స తీసుకున్న అనేకమంది కాలేయ ఇన్‌ఫెక్షన్‌కు గురవుతున్నట్లు గుర్తించారు. కొన్నేళ్ల తర్వాత అది ‘హెచ్‌ఐవీ (1980ల్లో దాన్ని ఎయిడ్స్‌ కారక వైరస్‌గా గుర్తించారు)’, ‘హెపటైటిస్‌-సీ’గా నిర్ధరించారు. బాధితుల సంఖ్య 30 వేలకు పైగా ఉన్నట్లు అంచనా. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు. ఇన్‌ఫెక్షన్‌కు గురైనవారిలో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నట్లు గుర్తించారు. ఇలా కొన్నేళ్లలోనే దాదాపు 3వేల మంది బాధితులు చనిపోయినట్లు నివేదికలు వెల్లడించాయి. దేశ ఆరోగ్య చరిత్రలో అతిపెద్ద ‘రక్తం కుంభకోణం’గా దీన్ని పేర్కొంటున్నారు. ఈ వైద్య నిర్లక్ష్యం గురించి వాస్తవాలు బయటపెట్టాలని.. పరిహారం ఇవ్వాలని 1980 నుంచీ బాధితులు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. చివరకు 2017లో ప్రధాని థెరిసా మే నేతృత్వంలోని ప్రభుత్వం.. పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. దాదాపు 5,000 మంది బాధితులు, సాక్షుల నుంచి వివరాలు సేకరించి విచారణ కమిటీ నివేదిక రూపొందించింది. దానిని సోమవారం ప్రభుత్వానికి సమర్పించింది. కుంభకోణాన్ని ఎన్‌హెచ్‌ఎస్‌ కప్పిపుచ్చిందని అందులో పేర్కొంది.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని