నెతన్యాహుపై అరెస్టు వారెంట్‌ ఇవ్వండి

ఇజ్రాయెల్‌-హమాస్‌ల మధ్య యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు సహా హమాస్, ఇజ్రాయెల్‌ నేతలకు అరెస్టు వారెంట్‌ జారీ చేయాలని అంతర్జాతీయ నేర న్యాయస్థానం(ఐసీసీ) ప్రధాన ప్రాసిక్యూటర్‌ సోమవారం కీలక అభ్యర్థనలు చేశారు.  

Published : 21 May 2024 05:13 IST

హమాస్‌ నేతలు యహ్యా సిన్వర్, మహమ్మద్‌ డెయిఫ్, ఇస్మాయిల్‌ హనియాపైనా జారీ చేయండి
ఐసీసీని కోరిన ప్రధాన ప్రాసిక్యూటర్‌

జెరుసలేం: ఇజ్రాయెల్‌-హమాస్‌ల మధ్య యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు సహా హమాస్, ఇజ్రాయెల్‌ నేతలకు అరెస్టు వారెంట్‌ జారీ చేయాలని అంతర్జాతీయ నేర న్యాయస్థానం(ఐసీసీ) ప్రధాన ప్రాసిక్యూటర్‌ సోమవారం కీలక అభ్యర్థనలు చేశారు.

గాజా స్ట్రిప్‌లో నెతన్యాహు, ఇజ్రాయోల్‌ రక్షణమంత్రి యెవా గాలెంట్‌ యుద్ధ నేరాలకు పాల్పడ్డారని చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ కరీమ్‌ఖాన్‌ ఆరోపించారు. వారి కారణంగా ఎంతోమంది అమాయక పౌరులు బాధలు అనుభవిస్తున్నారని, ఆకలితో అలమటిస్తున్నారని అన్నారు. ఈ యుద్ధంలో అనేకమంది మహిళలు, చిన్నారులు, పసికందులు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. మరోపక్క అక్టోబరు 7న ఇజ్రాయెల్‌ పౌరులపై పాల్పడిన నేరాలకు హమాస్‌ నేతలు యహ్యా సిన్వర్, మహమ్మద్‌ డెయిఫ్, ఇస్మాయిల్‌ హనియాపై అరెస్టు వారెంట్లు జారీ చేయాలని కరీమ్‌ఖాన్‌ అభ్యర్థించారు. వీరి మెరుపు దాడులతో ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయని, ఎంతోమంది తమ ప్రియమైనవారిని కోల్పోయారన్నారు. ప్రాసిక్యూటర్‌ వినతిపై ఐసీసీ విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది.మరోపక్క 2014 నాటి గాజా యుద్ధం కేసులో ఇజ్రాయెల్‌ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేసే అవకాశాలున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఒకవేళ ఈ వారెంట్లు జారీ అయితే, ఆ దేశ అధికారులను ఐసీసీ భాగస్వామ్య దేశాల్లో అరెస్టుచేసే ప్రమాదం ఉంది. 

ఖండించిన నెతన్యాహు, జో బైడెన్‌

ఐసీసీ ప్రాసిక్యూటర్‌ వినతిని ఇజ్రాయెల్‌ తీవ్రంగా ఖండించింది. ఇది దారుణమైన విజ్ఞాపన అని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు మండిపడ్డారు. ఈ తప్పిదాన్ని చరిత్ర ఎల్లకాలం గుర్తుంచుకుంటుందని ఇజ్రాయెల్‌ విదేశాంగమంత్రి కాజ్‌ ధ్వజమెత్తారు. దీన్ని ఎదుర్కొనడానికి తామో ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేస్తామని వివరించారు. కాగా ఐసీసీ ప్రాసిక్యూటర్‌ వినతిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఖండించారు. ఇజ్రాయెల్‌ నేతలను, హమాస్‌ తీవ్రవాదులను ఒక గాటనకట్టడం ఎంతమాత్రం ఆమోదయోగ్యంగా లేదన్నారు. 

బాధితులను, తలారిని ఒకే గాటన కట్టారు: హమాస్‌

ఐసీసీకి కరీమ్‌ఖాన్‌ చేసిన విజ్ఞప్తిపై హమాస్‌ ఆక్షేపణలు తెలిపింది. ఈ చర్య బాధితులను, తలారిని ఒకే గాటన కట్టినట్లుందని విమర్శించింది. ఇద్దరు ఇజ్రాయెల్‌ నేతల అరెస్టునే కోరారని తప్పుపట్టింది. మిగిలిన నేతల అరెస్టును కోరాలని సూచించింది. ఇజ్రాయెల్‌ ఆక్రమణను, సైనిక దాడిని అడ్డుకునే హక్కు తమకుందని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని