మానవ వృషణాల్లో సూక్ష్మ ప్లాస్టిక్‌లు

మానవ వృషణాల్లో సూక్ష్మ ప్లాస్టిక్‌లను పరిశోధకులు గుర్తించారు. దీంతో పురుషుల్లో వీర్య కణాలు తగ్గిపోవడానికి ఇవే కారణమై ఉంటాయా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

Published : 22 May 2024 04:33 IST

దిల్లీ: మానవ వృషణాల్లో సూక్ష్మ ప్లాస్టిక్‌లను పరిశోధకులు గుర్తించారు. దీంతో పురుషుల్లో వీర్య కణాలు తగ్గిపోవడానికి ఇవే కారణమై ఉంటాయా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పరిశోధనలో భాగంగా 23 మంది పురుషుల మృతదేహాలు, 47 పెంపుడు జంతువుల కళేబరాల నుంచి సేకరించిన వృషణాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. ప్రతి నమూనాలోనూ సూక్ష్మప్లాస్టిక్‌ల కాలుష్యం కనిపించింది. శునకాల్లో ప్రతి గ్రాము కణజాలంలో 123 మైక్రోగ్రాములు, మానవుల్లో 330 మైక్రోగ్రాముల మేర ఈ రేణువులు కనిపించాయి. ప్లాస్టిక్‌ సంచులు, బాటిళ్లలో వాడే పాలీఇథలీన్‌ పదార్థాలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. తర్వాతి స్థానంలో పీవీసీ ఉంది. పీవీసీ కాలుష్యం కారణంగా శునకాల వృషణాల్లో వీర్య కణాల సంఖ్య తగ్గినట్లు గుర్తించారు. అయితే సూక్ష్మప్లాస్టిక్‌ల వల్ల మానవుల్లోనూ ఈ ఇబ్బంది తలెత్తుతోందా అన్నదానిపై మరింత పరిశోధన అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

దశాబ్దాలుగా పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గుతోంది. దీనికి క్రిమిసంహారకాలు వంటి రసాయనాలు కారణంగా భావిస్తున్నారు. మానవ రక్తం, మాయ, తల్లిపాలలోనూ సూక్ష్మప్లాస్టిక్‌లు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. అవి పర్యావరణంలో విచ్చలవిడిగా వ్యాపించాయి. నీరు, ఆహారం, గాల్లో తిష్టవేశాయి. ఇవి కణజాలంలో చేరి ఇన్‌ఫ్లమేషన్‌కు కారణం కావొచ్చు. రక్తనాళాల్లోకి ఇవి చేరడం వల్ల పక్షవాతం, గుండె పోటు, తలెత్తుతున్నట్లు వైద్యులు కూడా తెలిపారు. పీవీసీ నుంచి విడుదలయ్యే అనేక రసాయనాలు.. వీర్య కణాల ఉత్పత్తికి ఆటంకం కలిగించవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మైక్రోప్లాస్టిక్స్‌ వల్ల వీటి సంఖ్య తగ్గొచ్చని ఎలుకలపై జరిగిన పరిశోధనల్లో ఇప్పటికే వెల్లడైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని