షెంజెన్‌ వీసా రుసుములను పెంచిన ఐరోపా

ఐరోపా పర్యటనకు వెళ్లాలనుకునే వారికి ప్రయాణ ఖర్చు మరింత భారం కానుంది. షెంజెన్‌ వీసా దరఖాస్తు రుసుంను 12 శాతం పెంచేందుకు యూరోపియన్‌ కమిషన్‌ ఆమోదించడమే అందుకు కారణం. జూన్‌ 11 నుంచి ఈ పెంపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల పౌరులకు వర్తిస్తుందని స్లొవేనియా విదేశీ, ఐరోపా వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Published : 22 May 2024 05:08 IST

భారతీయులపై ప్రభావం చూపే అవకాశం  

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐరోపా పర్యటనకు వెళ్లాలనుకునే వారికి ప్రయాణ ఖర్చు మరింత భారం కానుంది. షెంజెన్‌ వీసా దరఖాస్తు రుసుంను 12 శాతం పెంచేందుకు యూరోపియన్‌ కమిషన్‌ ఆమోదించడమే అందుకు కారణం. జూన్‌ 11 నుంచి ఈ పెంపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల పౌరులకు వర్తిస్తుందని స్లొవేనియా విదేశీ, ఐరోపా వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు పెద్దలకు షెంజెన్‌ వీసా దరఖాస్తు రుసుం 80 యూరోలు ఉండగా.. ఇప్పుడు దాన్ని 90 యూరోలకు పెంచారు. 6-12 ఏళ్ల పిల్లల దరఖాస్తు ఫీజును 40 యూరోల నుంచి 45 యూరోలు చేశారు. ద్రవ్యోల్బణం, ఉద్యోగుల వేతనాల పెంపు తదితర కారణాలతో ఈ వీసా రుసుంలను పెంచినట్లు యూరోపియన్‌ కమిషన్‌ తెలిపింది. చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో ఈ వీసా ధరలను పెంచారు. 

ఏంటీ షెంజెన్‌?

షెంజెన్‌ అంటే 29 ఐరోపా దేశాల సమాఖ్య అని అర్థం. 90 రోజుల వరకు ఆయా దేశాల్లో పర్యటించేందుకు వీలుగా షెంజెన్‌ వీసాలను జారీ చేస్తుంటారు. ఏదైనా షెంజెన్‌ దేశం ఈ వీసాను జారీ చేస్తే.. దానిపై ఇతర షెంజెన్‌ దేశాల్లోనూ పర్యటించేందుకు అనుమతి లభిస్తుంది. ఇటలీ, ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, క్రొయేషియా, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్‌ తదితర దేశాలు ఈ కోవలోకి వస్తాయి. యూరప్‌నకు వీసా దరఖాస్తుల్లో భారత్‌ మూడో స్థానంలో ఉండటంతో ఈ రుసుంల పెంపు ప్రభావం మన వాళ్లపై ఎక్కువగానే ఉండనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు