అండర్‌ 16... నో సోషల్‌ మీడియా!

తిండి తినటం లేదంటే... ఏడాది పిల్లలకూ సెల్‌ఫోన్‌ చేతిలో పెట్టేసి... ముద్ద నోట్లో పెడుతున్న కాలం! తప్పని తెలిసినా అనివార్యంగా పిల్లలను ఫోన్లకు, సోషల్‌ మీడియాకు అలవాటు చేస్తున్నామనే ఆందోళన పెరుగుతోంది.

Updated : 23 May 2024 09:46 IST

తిండి తినటం లేదంటే... ఏడాది పిల్లలకూ సెల్‌ఫోన్‌ చేతిలో పెట్టేసి... ముద్ద నోట్లో పెడుతున్న కాలం! తప్పని తెలిసినా అనివార్యంగా పిల్లలను ఫోన్లకు, సోషల్‌ మీడియాకు అలవాటు చేస్తున్నామనే ఆందోళన పెరుగుతోంది. అందుకే... పదహారేళ్ల వయసు దాటేదాకా పిల్లలను సోషల్‌మీడియాకు దూరంగా ఉంచాలనే డిమాండ్‌ ఊపందుకుంటోంది. తాజాగా ఆస్ట్రేలియా ఆ దిశగా అడుగులు వేస్తోంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్‌మీడియా చూడకుండా నిషేధం విధించాలని ఆలోచిస్తోంది. ప్రస్తుతం ఫేస్‌బుక్‌లాంటి అనేక సోషల్‌మీడియా వేదికల్లో చేరికకు 13 ఏళ్ల వయసుండాలనే నిబంధన ఉన్నా... దాన్ని అతిక్రమించడం పెద్ద కష్టమేమీ కావటం లేదు. అందుకే ఏకంగా నిషేధం విధించేలా చట్టం చేయాలనుకుంటున్నారు.  ఆస్ట్రేలియాలోని అనేక రాష్ట్రాలతో పాటు... ఆదేశ ప్రధాని  ఆంథోనీ అల్బనీస్‌ కూడా ఇందుకు మద్దతు పలికారు. మితిమీరిన సోషల్‌మీడియా వాడకం పిల్లల్ని దారితప్పేలా చేయటంతోపాటు... వారి మానసిక ఆరోగ్యానికీ నష్టం చేస్తోందన్నారు. ఆన్‌లైన్లో కాకుండా... మైదానాల్లో ఆడుకునేలా చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే చైనా, జపాన్, ఫ్రాన్స్‌లాంటి దేశాలు... నిషేధం విధించకున్నా... పిల్లలు మొబైల్, ట్యాబ్‌లాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాల వినియోగం తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నాయి. అంతెందుకు... ప్రపంచానికి ఐఫోన్‌లాంటివాటిని పరిచయం చేసిన... స్టీవ్‌జాబ్స్‌ తన పిల్లలను టీనేజీ దాటేదాకా సెల్‌ఫోన్లకు దూరంగా ఉంచారు. మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ సైతం... తన పిల్లల్ని గ్యాడ్జెట్స్‌ నుంచి కాపాడుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని