నెతన్యాహును అరెస్టు చేస్తారా?.. ఐసీసీ పరిణామాలతో సంచలనం

ఇజ్రాయెల్, హమాస్‌ యుద్ధంలో... తాజా అంకం- ఐసీసీ విచారణ! అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) తక్షణమే అటు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుపైనా, ఇటు హమాస్‌ నేతలపైనా అరెస్టు వారెంట్లు జారీ చేయాలంటూ ఐసీసీ చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ కోరటం అంతర్జాతీయంగా, దౌత్యపరంగా కలకలం సృష్టించింది.

Updated : 23 May 2024 08:10 IST

ఏమిటీ అంతర్జాతీయ నేర న్యాయస్థానం!

ఇజ్రాయెల్, హమాస్‌ యుద్ధంలో... తాజా అంకం- ఐసీసీ విచారణ! అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) తక్షణమే అటు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుపైనా, ఇటు హమాస్‌ నేతలపైనా అరెస్టు వారెంట్లు జారీ చేయాలంటూ ఐసీసీ చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ కోరటం అంతర్జాతీయంగా, దౌత్యపరంగా కలకలం సృష్టించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సైతం స్వయంగా దీన్ని వ్యతిరేకించటం గమనార్హం! ఇంతకూ ఐసీసీ అరెస్టు వారెంటు జారీ చేస్తుందా? చేస్తే ఏమౌతుంది? నెతన్యాహుతో పాటు హమాస్‌ నేతలను అరెస్టు చేస్తారా? చేస్తే ఎవరు చేస్తారు? అసలు ఏంటీ ఐసీసీ? అనేవి తెలుసుకోవాల్సిన అంశాలు!

ఆ రెండూ వేర్వేరు

నెదర్లాండ్స్‌లోని ది హేగ్‌ కేంద్రంగా ఐసీసీ పనిచేస్తుంది. హేగ్‌లోనే ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)కు ఇది భిన్నం! ఐసీజే అనేది... వివిధ దేశాల మధ్య వివాదాలను విచారించి తీర్పులిస్తుంది. ఐసీసీ మాత్రం వ్యక్తులపై నేరాలను విచారిస్తుంది. ఐసీజే ఐక్యరాజ్యసమితి విభాగాల్లో ఒకటి! ఐసీసీ కూడా ఐరాస ఆదేశాల మేరకు ఏర్పాటైందే అయినా... స్వతంత్రంగా పనిచేస్తుంది. 1998 జులై 17న ఐక్యరాజ్యసమితిలోని దౌత్యవేత్తల సదస్సు రోమ్‌లో ఆమోదించిన నిబంధనల మేరకు ఐసీసీ ఏర్పడింది. 124 దేశాలు ఈ ఒప్పందంపై సంతకం చేసి... ఐసీసీలో భాగస్వాములయ్యాయి. అంటే ఈ దేశాలన్నీ ఐసీసీ న్యాయ పరిధిని అంగీకరించాయి. 

ఈ నేరాలపై మాత్రమే...

మారణహోమం, మానవతకు మచ్చతెచ్చే నేరాలు, యుద్ధనేరాలు, దురాక్రమణలాంటి నేరాలపై మాత్రమే ఐసీసీ విచారిస్తుంది.  తొలుత ఐసీసీ చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ కార్యాలయం ప్రాథమికంగా విచారించి... తగిన ఆధారాలున్నాయనుకుంటే అరెస్టు వారెంటు జారీ చేయాలని సిఫార్సు చేస్తుంది. ఆధారాల్లో పస ఉందని భావిస్తే... న్యాయమూర్తుల ప్రాథమిక బృందం వారెంటుపై, విచారణార్హతపై నిర్ణయిస్తుంది. విచారణలో న్యాయమూర్తులు అన్ని అంశాలను బేరీజు వేసి తీర్పిస్తారు. దీనిపై నిందితులు సంతృప్తి చెందకపోతే... ఐదుగురు న్యాయమూర్తుల బెంచికి అప్పీల్‌ చేసుకోవచ్చు. వారిచ్చే తీర్పు అంతిమం. నిందితులను అరెస్టు చేయాలన్నా... వారిని ఐసీసీ నిర్బంధ కేంద్రంలోకి తీసుకురావాలన్నా... ఆస్తులను జప్తు చేయాలన్నా... తీర్పును అమలు చేయాలన్నా సభ్యదేశాలపై ఆధారపడటం తప్పించి ఐసీసీ సొంతగా ఏమీ చేయలేదు.

ఆ ముగ్గురు ఏమంటారో?

నెతన్యాహు, హమాస్‌ నేతల అరెస్టు కోసం చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ చేసిన విజ్ఞప్తి ప్రస్తుతం ఐసీసీలోని ముగ్గురు న్యాయమూర్తుల ముందుకు వెళుతుంది. అరెస్టు వారెంటుకు అవసరమైన ఆధారాలున్నాయో లేదో వారు చూసి నిర్ణయిస్తారు. ఆధారాలున్నాయనుకుంటే వారెంటు జారీ చేస్తారు. ప్రస్తుతం ఈ ధర్మాసనంలో రుమేనియా, మెక్సికో, బెనిన్‌లకు చెందిన న్యాయమూర్తులున్నారు. వీరు తమ నిర్ణయం ఫలానా సమయంలోగా చెప్పాలనే నిర్దిష్ట గడువు ఏమీ లేదు. గతంలో చాలా కేసుల్లో వారెంట్లపై నిర్ణయానికి కొన్ని నెలల పాటు తీసుకున్న సందర్భాలున్నాయి.

పుతిన్‌పైనా... 

ఇప్పటిదాకా ఐసీసీ 46 అరెస్టు వారెంట్లు జారీ చేసింది. వారిలో 21 మందిని అరెస్టు చేసి నిర్బంధంలో ఉంచారు. ఉక్రెయిన్‌లో పిల్లలను కిడ్నాప్‌ చేశారనే ఆరోపణలపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌పైనా ఐసీసీ ఇటీవలే అరెస్టు వారెంటు జారీ చేసింది. గతంలో సూడాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో నరమేధం ఆరోపణలపై ఒమర్‌ అల్‌బషీర్‌పై, లిబియా మాజీ నేత గడాఫీపైనా అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. 

దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్‌ మద్దతు

బ్రిటిష్‌-లెబనీస్‌ బారిస్టర్‌ అమల్‌ క్లూనీ... తాజా కేసులో అరెస్టు వారెంట్లు జారీ చేయటానికి అవసరమైన సాక్ష్యాలను సేకరించి ప్రాసిక్యూషన్‌కు సహకరించినట్లు చెబుతున్నారు. వాటి ఆధారంగానే ఐసీసీ చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ కరీమ్‌ఖాన్‌... ఇజ్రాయెల్, హమాస్‌ నేతల అరెస్టుకు పట్టుపడుతున్నారు. ఇజ్రాయెల్, హమాస్‌ సహజంగానే అరెస్టు వారెంట్ల డిమాండ్‌ను ఖండించాయి. అమెరికా సైతం ఇజ్రాయెల్‌కు ఈ విషయంలో మద్దతు ప్రకటించింది. నాజీల్లాంటి దారుణమైన ఉగ్రవాద సంస్థ హమాస్‌తో ఇజ్రాయెల్‌ను పోల్చటాన్ని తాము అంగీకరించబోమని బైడెన్‌ స్పష్టం చేశారు. అరెస్టు వారెంట్లు జారీ కాకుండా దౌత్యపరంగా ఒత్తిడి తెస్తామన్నారు. మరోవైపు దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్‌లాంటి దేశాలు మాత్రం... ఐసీసీ అరెస్టు వారెంటుకు మద్దతిస్తుండటం విశేషం.


ఇవి లేవు

అమెరికా, రష్యా, చైనా, ఇజ్రాయెల్, భారత్‌లాంటి ప్రధాన దేశాలు రోమ్‌ ఒప్పందంపై సంతకం చేయలేదు. ఐసీసీలో చేరలేదు. అంటే ఇవి ఐసీసీ ఆదేశాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు.


వారెంటు జారీ చేస్తే...

అరెస్టు వారెంటు జారీ చేసిన ఐసీసీ... పోలీసులను పంపి నిందితులను అరెస్టు చేయదు. ఎందుకంటే దానికి సొంత పోలీసు దళం అంటూ ఏమీ లేదు.  సభ్య దేశాలు ఆ పని చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత కేసులో ఒకవేళ నెతన్యాహు, హమాస్‌ నేతలపై అరెస్టు వారెంటు జారీ అయితే 124 ఐసీసీ సభ్యదేశాల్లో ఏదైనా వారిని అరెస్టు చేసే అవకాశం ఉంటుంది. ఆయా దేశాల్లోకి నిందితులు అడుగుపెడితేనే! అంటే... అరెస్టు వారెంటు జారీ అయితే... నిందితుల విదేశీ ప్రయాణాలు కట్టడి అయినట్లే! ఐసీసీలో సభ్యత్వం లేని దేశాలకు మాత్రం నిశ్చింతగా వెళ్లవచ్చు. నెతన్యాహు అమెరికాకు వెళ్లవచ్చు! అలాగే ప్రస్తుతం దోహాలో ఉన్నారని భావిస్తున్న హమాస్‌ నేతలూ అక్కడే ఉండొచ్చు. ఎందుకంటే ఖతార్‌ ఐసీసీలో సభ్యదేశం కాదు. అలాగని 124 దేశాలూ తప్పనిసరిగా ఐసీసీ ఆదేశాల మేరకు అరెస్టు చేయాలనీ లేదు. ఏదైనా సభ్యదేశంలో నిందితులు అడుగుపెట్టినా వారిని ఆ దేశం అరెస్టు చేయకుంటే ఐసీసీ తక్షణమే చేసేదేమీ లేదు. ఆ విషయాన్ని ఐసీసీ సర్వసభ్య సదస్సుకు తర్వాత... ఐక్యరాజ్యసమితి భద్రతామండలికి నివేదిస్తారంతే! తాజా కేసులో నెతన్యాహులాంటి నేతపై వారెంటు జారీ అయినా వచ్చిన నష్టమేమీ లేకున్నా, ఈ నిర్ణయానికి ప్రాధాన్యం ఉంటుంది. కారణం- ఇప్పటిదాకా ఐసీసీ నిర్ణయాలు పెద్దగా పాశ్చాత్యదేశాలకు, వాటి మిత్రదేశాలకు వ్యతిరేకంగా రాలేదు. అందుకే ఈసారి వారెంటు జారీ అయితే... అది సంచలనమే అవుతుందను కుంటున్నారు. 

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు