రెక్కలు ఎందుకు తెగుతున్నాయ్‌?.. ఉసురుతీస్తున్న హెలికాప్టర్‌ ప్రమాదాలు

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణంతో హెలికాప్టర్‌ ప్రయాణాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఈ లోహవిహంగాల్లో ఉన్న సంక్లిష్టతలు, వాటితో పొంచి ఉన్న ముప్పులపైకి అందరి దృష్టి మళ్లింది.

Updated : 23 May 2024 07:36 IST

అప్రమత్తత లేకుంటే బలాలే బలహీనతలు
 

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణంతో హెలికాప్టర్‌ ప్రయాణాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఈ లోహవిహంగాల్లో ఉన్న సంక్లిష్టతలు, వాటితో పొంచి ఉన్న ముప్పులపైకి అందరి దృష్టి మళ్లింది. ఒకప్పటితో పోలిస్తే హెలికాప్టర్లలో భద్రతా ప్రమాణాలు మెరుగుపడినప్పటికీ.. ప్రమాదం నీడలా వెంటాడుతూనే ఉంటుంది. అనుక్షణం అప్రమత్తత అవసరం. విమానాలతో పోలిస్తే ఈ లోహవిహంగాలు కూలిపోయే ముప్పు 35 శాతం అధికం. ప్రతి లక్ష గంటల గగనవిహారానికి హెలికాప్టర్లు   కుప్పకూలే రేటు 9.84గా ఉంది. విమానాల విషయంలో అది 7.26గా ఉంది. 

డిజైన్‌రీత్యా హెలికాప్టర్లకు అనేక ప్రత్యేక సామర్థ్యాలు ఉన్నాయి. వీటి ల్యాండింగ్, టేకాఫ్‌కు రన్‌వేలు అవసరంలేదు. నిటారుగా గాల్లోకి లేచి, అదే రీతిలో కిందకి దిగగలవు. గాల్లో చాలాసేపు ఒకేచోట నిశ్చలంగా ఉండగలవు. తక్కువ ఎత్తులో విహరించగలవు. అంతా సవ్యంగా ఉంటే ఇవన్నీ అనుకూలాంశాలు. ఈ ప్రత్యేకతలను ఉపయోగించుకొని.. విమానాలు ప్రయాణించలేని ప్రదేశాలకూ హెలికాప్టర్ల సాయంతో చేరుకోవచ్చు. ఒక ప్రదేశాన్ని గగనతలం నుంచి నిశితంగా గమనించొచ్చు. ఎక్కడైనా తేడా జరిగితే మాత్రం ఈ బలాలే బలహీనతలవుతాయి. హెలికాప్టర్‌ చాలా సంక్లిష్ట యంత్రం. అందులో కదిలే భాగాలు చాలా ఎక్కువ. అందువల్ల వాటికి ఎప్పటికప్పుడు మరమ్మతులు, సరైన నిర్వహణ అవసరం. పైలట్‌ నైపుణ్యం, చాకచక్యం చాలా ముఖ్యం. ఇందులో ఎక్కడ తేడా వచ్చినా ఇబ్బందులు తప్పవు. 


హెలికాప్టర్‌ ప్రమాదాలకు ప్రధాన కారణాలు.. 

1. మానవ తప్పిదాలు

పైలట్లు, గగనతల రద్దీ నియంత్రణ అధికారులు (ఏటీసీ), మరమ్మతులు, నిర్వహణ సిబ్బంది చేసే తప్పిదాలు కొంపముంచుతుంటాయి. విమానాలతో పోలిస్తే హెలికాప్టర్‌ పైలట్లకు ఎక్కువ నైపుణ్యం, అప్రమత్తత అవసరం. చాలా హెలికాప్టర్లలోని నియంత్రణ వ్యవస్థలను పైలట్లు స్వయంగా నిరంతరం నిర్వహిస్తుండాల్సి ఉంటుంది. విమానాల తరహాలో ఆటోపైలట్‌కు వాటిలో ఆస్కారం ఉండదు. దీనికితోడు విస్తృతంగా సమాచారాన్ని ప్రాసెస్‌ చేస్తుండాలి. కొన్నిసార్లు ఇవి పైలట్ల పనిభారాన్ని పెంచుతాయి. అందువల్ల వారు అలసటకు గురవుతుంటారు. అలాంటి పరిస్థితులత్లో వారు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చు. 

హెలికాప్టర్లను ఎక్కడైనా ల్యాండ్‌ చేసే వీలుండటమూ ప్రమాదాలకు కారణం కావొచ్చు. ఒకింత ప్రతికూల ప్రదేశాల్లో కూడా దించేందుకు పైలట్లు కొన్నిసార్లు సాహసిస్తుంటారు. ఈ క్రమంలో చుట్టుపక్కల అవరోధాలను విస్మరిస్తుంటారు. 

ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌: సుశిక్షితులైన ఏటీసీలు తప్పులు చేయడం చాలా అరుదు. విమానాశ్రయాలకు సమీపంలోని ప్రాంతాల్లో హెలికాప్టర్‌ విహరిస్తున్నప్పుడు వారు పొరపాట్లు చేసే వీలుంది.  

నిర్వహణ సిబ్బంది తప్పిదాలు: నిర్వహణ సిబ్బంది వల్ల కూడా పొరపాట్లు జరుగుతుంటాయి. వారు పనిముట్లను హెలికాప్టర్‌లోనే వదిలేస్తుండొచ్చు. కొన్ని భాగాలను గట్టిగా బిగించకపోయి ఉండొచ్చు. ఇలాంటివన్నీ ప్రమాదకరం. అందువల్ల మరమ్మతుల అనంతరం హెలికాప్టర్‌ను పైలట్లు క్షుణ్నంగా తనిఖీ చేస్తుంటారు.

2. సాంకేతిక సమస్యలు 

హెలికాప్టర్‌ ప్రధాన యంత్ర భాగాల్లోని మెయిన్‌ రోటర్‌ (ప్రధాన రెక్కలు), టెయిల్‌ రోటర్‌ (తోక రెక్కలు), రోటర్‌ షాఫ్ట్, ప్రధాన గేర్‌ బాక్స్, పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ వంటి వాటిలో ఏ ఒక్కటి విఫలమైనా, లోపం తలెత్తినా ప్రమాదం పొంచి ఉంటుంది. అది సురక్షితంగా దిగడం చాలా కష్టం. ఉదాహరణకు.. రెండు ఇంజిన్లు కలిగిన ప్రయాణికుల విమానంలో ఒక ఇంజిన్‌ లేదా అనేక ఇతర యంత్ర విభాగాలు విఫలమైనా అది సురక్షితంగా ల్యాండ్‌ అవడానికి ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. హెలికాప్టర్‌కు ఈ వెసులుబాటు ఉండదు. 

ప్రధాన రోటర్‌పై నియంత్రణ కోల్పోవడం: హెలికాప్టర్‌ పైభాగంలో ఉండే ప్రధాన రెక్కలు (రోటర్‌) దెబ్బతినడం కానీ దాని భ్రమణంపై పైలట్‌ నియంత్రణ కోల్పోవడం కానీ జరిగితే ఆ లోహవిహంగం కూలిపోయే ప్రమాదం ఉంటుంది. 

ఈ రోటర్‌ దెబ్బతినడానికి అవకాశం చాలా ఎక్కువ. హెలికాప్టర్‌ తక్కువ ఎత్తులో ఎగిరేటప్పుడు, గాల్లో స్థిరంగా ఒకచోట ఉన్నప్పుడు పరిసరాల్లోని చెట్లు, సెల్‌ఫోన్‌ టవర్లు, కరెంటు స్తంభాలు, వైర్లు, కొండలు, భవనాలు వంటివి ఈ రెక్కలకు తగలొచ్చు.  

తోక రెక్కలు: హెలికాప్టర్‌ను స్థిరంగా ఉంచడంలో తోక రెక్కలు చాలా కీలకం. అవి లేకుంటే.. ప్రధాన రెక్కలు తిరిగే దిశకు వ్యతిరేక దిశలో హెలికాప్టర్‌ బాడీ తిరుగుతుంది. అందువల్ల ఈ భాగంలో వైఫల్యం తలెత్తితే.. లోహవిహంగాన్ని పైలట్‌ నియంత్రించడం కష్టమవుతుంది. 

విడిభాగాలు లేదా వ్యవస్థ వైఫల్యం: హెలికాప్టర్‌లో అకస్మాత్తుగా ఏదైనా విడిభాగం విఫలమైతే అది ప్రమాదకరం కావొచ్చు. ఆ లోహవిహంగాల్లోని ఏ భాగానికైనా ఈ ముప్పు పొంచి ఉంటుంది. గేర్‌బాక్స్‌ వైఫల్యం ప్రధానమైంది. ఈ భాగంపై చాలా ఒత్తిడి ఉంటుంది. అందువల్ల పగుళ్లు, వైఫల్యం ముప్పు దానికి ఎక్కువ. 

ఇంజిన్‌ వైఫల్యం: ఇంజిన్‌ వైఫల్యం వల్ల హెలికాప్టర్లు కచ్చితంగా కూలిపోతాయని భావిస్తుంటారు. అయితే ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు చాలా సందర్భాల్లో పైలట్లు తమ నైపుణ్యంతో ప్రమాదాన్ని తప్పిస్తుంటారు. ఒకే ఇంజిన్‌ ఉన్న హెలికాప్టర్‌లో ఈ పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు పైలట్‌.. ఆ లోహవిహంగాన్ని ‘ఆటోరొటేషన్‌’లో పెడతారు. ఇందులో నియంత్రిత పద్ధతిలో పవర్‌-ఆఫ్‌ డిసెంట్‌కు, ఆ తర్వాత నియంత్రిత ల్యాండింగ్‌కు ఉపక్రమిస్తారు. ఇది చాలా సంక్లిష్టమైన విన్యాసం. 

రెండు ఇంజిన్లు ఉన్న హెలికాప్టర్‌లో పరిస్థితి మరింత సులువుగా ఉంటుంది. అది మోసుకెళ్లే బరువు ఎక్కువగా లేనప్పుడు ఒకే ఇంజిన్‌తో నియంత్రిత ప్రయాణం సాధ్యమే. గాల్లో నిశ్చలంగా ఉంచడం వంటివి కష్టం. ల్యాండింగ్‌కూ ప్రత్యేక నైపుణ్యం అవసరం. 

ఇంజిన్‌ విఫలమైనా విమానం కొంతవరకూ గ్లైడ్‌ అవుతూ వెళ్లగలదు. సమీపంలోని ఎయిర్‌పోర్టులో దిగడానికి ఆస్కారం ఉంటుంది. హెలికాప్టర్‌కు గ్లైడింగ్‌ సామర్థ్యం ఉండదు. ఇంజిన్‌ విఫలమైన పరిస్థితుల్లో సురక్షిత ల్యాండింగ్‌ ప్రదేశం కోసం ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఆ లోహవిహంగానికి ఉండదు. 

ఇంధనం అందకపోవడం, నిండుకోవడం: ఇంజిన్‌కు ఇంధనం సరఫరా కాకుండా అవరోధం ఏర్పడటం లేదా ఇంధనం అయిపోవడం వల్ల హెలికాప్టర్‌కు ఇబ్బంది తలెత్తవచ్చు. ఇంధన పరిమాణాన్ని సూచించే సాధనం మొరాయించడం వంటి వాటి వల్ల పైలట్‌ ఈ సమస్యను గుర్తించలేకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసర ల్యాండింగ్‌ చేయకపోతే ప్రమాదకరం. 

3. పర్యావరణ అంశాలు 

తక్కువ ఎత్తులో ఎగరడం వల్ల హెలికాప్టర్లకు ప్రతికూల వాతావరణం, పక్షుల ఢీతో ముప్పు ఎక్కువ. దట్టమైన మంచు, భారీ వర్షపాతం, పెనుగాలులు వంటి సందర్భాల్లో దృశ్య స్పష్టత తక్కువగా ఉండటం వల్ల హెలికాప్టర్లు ఎక్కువగా ప్రమాదాలకు లోనవుతుంటాయి. అందువల్ల విమానాలతో పోలిస్తే హెలికాప్టర్‌ పైలట్లే ఎక్కువగా వాతావరణ నివేదికలను అడుగుతుంటారు. వాతావరణం సరిగా లేకపోయినప్పటికీ ప్రయాణాలను పైలట్లు కొనసాగించి, ప్రమాదాలకు కారణమైన సందర్భాలు అనేకం ఉన్నాయి. 

గాలింపు, సహాయచర్యలు, వైద్యపరమైన అత్యవసర సేవలకు, గస్తీ, మంటలు ఆర్పడానికి, సైనిక చర్యల్లో హెలికాప్టర్లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇలాంటివి కూడా ఆ లోహవిహంగాలకు ముప్పును పెంచుతుంటాయి.

ఈనాడు ప్రత్యేక విబాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని