ఉక్రెయిన్‌ సరిహద్దులపై విరుచుకుపడుతున్న రష్యా

ఉక్రెయిన్‌ ఈశాన్యంలో ఉన్న ఖర్కీవ్‌ ప్రాంతంపై రష్యా తీవ్రస్థాయిలో దాడులు చేస్తోంది. శుక్రవారం జరిగిన దాడుల్లో రైలు పట్టాలు, రైల్వే ఆస్తులు దెబ్బతిన్నాయి. దీంతో ఆ ప్రాంతంలోని చిన్నారులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Published : 25 May 2024 06:22 IST

రైలు పట్టాలు, మౌలిక వసతులు ధ్వంసం 

కీవ్‌: ఉక్రెయిన్‌ ఈశాన్యంలో ఉన్న ఖర్కీవ్‌ ప్రాంతంపై రష్యా తీవ్రస్థాయిలో దాడులు చేస్తోంది. శుక్రవారం జరిగిన దాడుల్లో రైలు పట్టాలు, రైల్వే ఆస్తులు దెబ్బతిన్నాయి. దీంతో ఆ ప్రాంతంలోని చిన్నారులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రష్యా దాడుల్లో భవనాలు కూడా దెబ్బతిన్నట్లు చెప్పారు. ఈ నెల 10 నుంచి ఖర్కీవ్‌ ప్రాంతంపై రష్యా విరుచుకుపడుతోంది. నాటి నుంచి 11 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వచ్చే 60 రోజుల్లో అనాథలు, ఒంటరి పిల్లలను తప్పనిసరిగా అక్కడి నుంచి తరలించాలని ప్రాంతీయ గవర్నర్‌ ఒలెహ్‌ సినేహుబో వివరించారు. ఇదే సమయంలో ఉక్రెయిన్‌లోని ఇతర ప్రాంతాల్లోనూ రష్యా దళాలు దాడులు చేస్తున్నాయి. ఇవన్నీ ఒక వ్యూహం ప్రకారం సమన్వయంతో సాగుతున్నట్లు విశ్లేషిస్తున్నారు. రెండేళ్లుగా సాగుతున్న యుద్ధంతో కుదేలైన ఉక్రెయిన్‌కు ఇది శరాఘాతంగా మారింది. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ఉక్రెయిన్‌ సైన్యానికి తాజాగా రైల్వే నెట్‌వర్క్‌ ధ్వంసంతో మరిన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. రష్యా దాడులను ఎదుర్కోవడానికి అవసరమైన గగనతల రక్షణ వ్యవస్థలు పశ్చిమ దేశాల నుంచి అందకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. రష్యా భూభాగాన్ని లక్ష్యంగా చేసుకోగల దీర్ఘశ్రేణి అస్త్రాలను ఇవ్వడానికి ఆ దేశాలు ఇష్టపడటంలేదు. దీంతో ఉక్రెయిన్‌ సరిహద్దులపై పుతిన్‌ సేన విరుచుకుపడుతోంది. ఈ ఆయుధాల లోటే ఖర్కీవ్‌పై దాడులకు కారణమని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. గురువారం రష్యా క్షిపణి ఒకటి ఒక ప్రింటింగ్‌ కంపెనీపై పడిందని, ఫలితంగా 50వేల పుస్తకాలు దగ్ధమయ్యాయని ఆయన చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని