ఫ్రాన్స్‌లో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్ల సమ్మె..

ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లోని అత్యంత రద్దీగా ఉండే ఓర్లీ విమానాశ్రయం ఒక్కసారిగా బోసిపోయింది. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లు సామూహిక సమ్మెకు దిగడంతో దాదాపు 70 శాతానికి పైగా విమానాలు రద్దయ్యాయి. ఈ మేరకు ఫ్రాన్స్‌ పౌరవిమానయాన శాఖ వెల్లడించింది.

Published : 26 May 2024 04:48 IST

70 శాతం విమానాలు రద్దు

పారిస్‌: ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లోని అత్యంత రద్దీగా ఉండే ఓర్లీ విమానాశ్రయం ఒక్కసారిగా బోసిపోయింది. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లు సామూహిక సమ్మెకు దిగడంతో దాదాపు 70 శాతానికి పైగా విమానాలు రద్దయ్యాయి. ఈ మేరకు ఫ్రాన్స్‌ పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం.. శనివారం ఉదయం నుంచి ఆదివారం రాత్రి వరకు విమానాల రాకపోకలు నిలిచిపోనున్నాయి. జులై 26న పారిస్‌ ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవానికి నగరం సిద్ధమవుతున్న తరుణంలో ఈ సమ్మె జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఓర్లీ విమానాశ్రయ నిర్వాహకులు తక్కువ సిబ్బందితో కాలం వెళ్లదీస్తున్నారని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లు ఆరోపిస్తున్నారు. ఒప్పంద ప్రాతిపదికన కొందరిని నియమిస్తున్నారని, ఇదే కొనసాగితే 2027 నాటికి రెగ్యులర్‌ సిబ్బంది కొరత ఏర్పడుతుందని, ఖాళీల భర్తీపై స్పష్టమైన ప్రకటన వచ్చేంతవరకు విధుల్లోకి చేరబోమని వారు స్పష్టంచేశారు. ఉద్యోగుల చర్యను అక్కడి ప్రభుత్వం ఖండించింది. కొంతమంది స్థానిక ఏజెంట్ల మాటలు వినే ఉద్యోగులు సమ్మెకు దిగారని, ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమానయానశాఖ డిప్యూటీ మంత్రి ప్యాట్రిస్‌ వెగ్రిట్‌ మీడియాకు తెలిపారు. సిబ్బందితో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. విమాన సిబ్బంది ఇలా హఠాత్తుగా సమ్మెకు దిగడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. మే ప్రారంభంలో సమ్మె కారణంగా ఐరోపా దేశాలకు పెద్దసంఖ్యలో విమాన సర్వీసులు రద్దయిన సంగతి తెలిసిందే. విమానాశ్రయ అధికారులు, అక్కడి ప్రధాన లేబర్‌ యూనియన్‌ ఎస్‌ఎన్‌సీటీఏ మధ్య చర్చలు సఫలమవడంతో అప్పటి వివాదం ముగిసింది. తాజాగా రెండో అతిపెద్ద లేబర్‌ గ్రూప్‌ యూఎన్‌ఎస్‌ఏ- ఐసీఎన్‌ఏ సమ్మెకు పిలుపునిచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు