ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలం

ఉత్తర కొరియా తన కవ్వింపు చర్యలను కొనసాగిస్తోంది. ఐరాస తీర్మానాలను బేఖాతరు చేస్తూ రెండో సైనిక నిఘా ఉపగ్రహంతో ఒక రాకెట్‌ను సోమవారం ప్రయోగించింది. అయితే అ వాహకనౌక గాల్లోనే పేలిపోయింది.

Published : 28 May 2024 04:56 IST

గాల్లోనే పేలిపోయిన రాకెట్‌ 

సియోల్‌: ఉత్తర కొరియా తన కవ్వింపు చర్యలను కొనసాగిస్తోంది. ఐరాస తీర్మానాలను బేఖాతరు చేస్తూ రెండో సైనిక నిఘా ఉపగ్రహంతో ఒక రాకెట్‌ను సోమవారం ప్రయోగించింది. అయితే అ వాహకనౌక గాల్లోనే పేలిపోయింది. ఉత్తర కొరియా వాయవ్య ప్రాంతంలోని అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఒక కొత్త రాకెట్‌లో నిఘా ఉపగ్రహాన్ని ఉంచి నింగిలోకి పంపినట్లు ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ (కేసీఎన్‌ఏ) పేర్కొంది. అయితే మొదటి దశలోనే లోపం తలెత్తి, రాకెట్‌ పేలిపోయిందని తెలిపింది. దీనికి ఇంజిన్‌ సమస్యే ఇందుకు కారణమై ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొంది. అంతకుముందు ఉత్తర కొరియా.. ఒక శాటిలైట్‌ రాకెట్‌ ప్రయోగాన్ని చేపట్టబోతున్నట్లు జపాన్‌ తీరరక్షక దళానికి సమాచారం ఇచ్చింది. కొరియన్‌ ద్వీపకల్పం, చైనా, ఫిలిప్పీన్స్‌కు చెందిన లుజాన్‌ దీవికి మధ్య ఉన్న జలాల్లో అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. జూన్‌ 3 అర్ధరాత్రి వరకూ ఈ హెచ్చరిక అమల్లో ఉంటుందని పేర్కొంది. నిఘా ఉపగ్రహానికి సంబంధించిందిగా భావిస్తున్న ఒక రాకెట్‌ ప్రయోగాన్ని తాము సోమవారం గుర్తించినట్లు దక్షిణ కొరియా సైన్యం పేర్కొంది. ప్రయోగించిన 4 నిమిషాలకు అది పేలిపోయిందని, దాని శకలాలు సముద్ర జలాలపై పడ్డాయని తెలిపింది. తొలుత దీన్ని క్షిపణి ప్రయోగంగా జపాన్‌ భావించింది. ఆ మేరకు ఒకినావా దీవిలో ప్రజలను అప్రమత్తం చేసింది. ఆ తర్వాత ఆ హెచ్చరికను వెనక్కి తీసుకుంది. సియోల్‌లో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సక్‌ యోల్, జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా, చైనా ప్రధాన మంత్రి లీ క్వియాంగ్‌ల త్రైపాక్షిక భేటీ జరిగిన రోజునే ఉత్తర కొరియా ఈ ప్రయోగానికి పూనుకోవడం గమనార్హం. ఉపగ్రహ ప్రయోగాలను చేపట్టరాదని ఉత్తర కొరియాపై ఐరాస భద్రతా మండలి ఆంక్షలు విధించింది. ఈ ప్రయోగాల ముసుగులో దీర్ఘశ్రేణి క్షిపణి పరిజ్ఞానాన్ని పరీక్షించే అవకాశం ఉన్నందువల్ల ఈ చర్యను చేపట్టింది. అమెరికా నుంచి పెరుగుతున్న సైనిక బెదిరింపులను ఎదుర్కోవడానికి అంతరిక్ష ఆధారిత నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నట్లు ఉత్తర కొరియా గతంలో ప్రకటించింది. గత ఏడాది నవంబరులో తన తొలి సైనిక ఉపగ్రహాన్ని ప్రయోగించింది. అయితే అది అందించే చిత్రాల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు