పాలస్తీనాను గుర్తిస్తున్నాం

గాజాలో సంక్షోభం తారస్థాయికి చేరిన వేళ, పాలస్తీనాను స్వతంత్ర దేశంగా మంగళవారం నుంచి అధికారికంగా గుర్తిస్తున్నట్లు స్పెయిన్, నార్వే, ఐర్లాండ్‌ ప్రకటించాయి.

Updated : 29 May 2024 06:08 IST

అధికారికంగా ప్రకటించిన స్పెయిన్, నార్వే, ఐర్లాండ్‌
రఫాపై మళ్లీ ఇజ్రాయెల్‌ దాడి
37 మంది మృతి

ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో దక్షిణ గాజాలోని రఫా నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్న పాలస్తీనీయులు

బార్సిలోనా/జెరూసలెం: గాజాలో సంక్షోభం తారస్థాయికి చేరిన వేళ, పాలస్తీనాను స్వతంత్ర దేశంగా మంగళవారం నుంచి అధికారికంగా గుర్తిస్తున్నట్లు స్పెయిన్, నార్వే, ఐర్లాండ్‌ ప్రకటించాయి. పాలస్తీనీయన్లు, ఇజ్రాయెలీలు శాంతిని సాధించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని మంగళవారం స్పెయిన్‌ ప్రధాని పెడ్రో శాంచెజ్‌ తెలిపారు. ఐర్లాండ్‌ కూడా ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఆ దేశ పార్లమెంటు భవనంపై పాలస్తీనా జెండా ఎగరవేశారు. నార్వే కూడా అధికారికంగా గుర్తిస్తున్నట్లు పేర్కొంది. ఐరోపా దేశాలు తీసుకున్న ఈ నిర్ణయంపై ఇజ్రాయెల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యూదులకు వ్యతిరేకంగా నరమేధానికి పాల్పడుతున్న శక్తులకు ఊతమివ్వడంపై మండిపడింది. పాలస్తీనాను ఇప్పటికే 140కి పైగా దేశాలు గుర్తించాయి. ఐరోపాలోని కీలక దేశాలైన ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ తదితర దేశాలు మాత్రం ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

కొనసాగుతున్న రక్తపాతం

రఫాలో రక్తపాతం కొనసాగుతోంది. సోమవారం రాత్రి, మంగళవారం మరో 37 మంది పాలస్తీనీయన్లు ఇజ్రాయెల్‌ దాడిలో మృతి చెందారు.  

మరో నౌకపై దాడి

ఎర్రసముద్రంలో మరో వాణిజ్య నౌకపై మంగళవారం క్షిపణి దాడి జరిగింది. దీంతో ఆ నౌకకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అందులో సిబ్బంది సురక్షితంగా ఉన్నారని యునైటెడ్‌ కింగ్‌డమ్‌ మారిటైమ్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌ సెంటర్‌ తెలిపింది. దాదాపు మూడు క్షిపణులు ఈ నౌకను తాకాయని తెలుస్తోంది. హూతీ తిరుగుబాటుదారులే దాడి చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. 


నేనొస్తే వాళ్లు ఇంటికే: ట్రంప్‌

పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలను చేపట్టిన విదేశీ విద్యార్థులను అధికారంలోకి వచ్చిన తర్వాత వారి స్వదేశాలకు పంపించేస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. న్యూయార్క్‌లో జరిగిన రౌండ్‌టేబుల్‌ కార్యక్రమంలో దాతలతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వారి ప్రవర్తనకు మూల్యం చెల్లించుకొంటారని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని