విమానాన్ని కుదిపేసిన గురుత్వాకర్షణ బలాలు

గురుత్వాకర్షణ బలాల్లో వేగంగా చోటుచేసుకున్న మార్పు వల్లే గతవారం సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం.. గాల్లో 178 అడుగుల మేర అకస్మాత్తుగా కిందకి వచ్చేసిందని ప్రాథమిక విచారణలో తేలింది.

Updated : 30 May 2024 05:16 IST

సింగపూర్‌ ఫ్లైట్‌ కుదుపులపై ప్రాథమిక నివేదిక 

సింగపూర్‌: గురుత్వాకర్షణ బలాల్లో వేగంగా చోటుచేసుకున్న మార్పు వల్లే గతవారం సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం.. గాల్లో 178 అడుగుల మేర అకస్మాత్తుగా కిందకి వచ్చేసిందని ప్రాథమిక విచారణలో తేలింది. విమానంలోని ఫ్లైట్‌ డేటా రికార్డర్, కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌లో నమోదైన డేటా ఆధారంగా దీన్ని రూపొందించారు. ఈ నెల 21న ‘ఫ్లైట్‌ ఎస్‌క్యూ321’ విమానం లండన్‌ నుంచి సింగపూర్‌ బయల్దేరింది. మయన్మార్‌లో ఇరావాడ్డీ బేసిన్‌పై ఉండగా తీవ్రస్థాయి కుదుపులకు లోనైంది. ఇందులో బ్రిటన్‌కు చెందిన ఒక ప్రయాణికుడు దుర్మరణం పాలయ్యాడు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. తాజాగా దీనిపై సింగపూర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సేఫ్టీ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (టీఎస్‌ఐబీ)కు చెందిన నిపుణులు ఒక ప్రాథమిక నివేదికను సమర్పించారు. దీని ప్రకారం.. 

  • నాడు బోయింగ్‌ 777-300ఈఆర్‌ శ్రేణికి చెందిన ఈ విమానం.. 37వేల అడుగుల ఎత్తులో పయనిస్తోంది. అకస్మాత్తుగా 19 సెకన్ల పాటు గురుత్వాకర్షణ బలాల్లో +0.44జీ నుంచి +1.57 వరకూ వైరుధ్యాలు వచ్చాయి. ఫలితంగా విమానం కుదుపులకు లోనైంది. 
  • భూమి సాధారణ గురుత్వాకర్షణ బలంతో పోల్చి చూసినప్పుడు తలెత్తే హెచ్చుతగ్గులను జీ బలాలు సూచిస్తాయి. సాధారణ గురుత్వాకర్షణ బలాన్ని +1జీగా పేర్కొంటారు. అది +1.57జీకి పెరిగితే ఒక వ్యక్తికి తన బరువు సాధారణం కన్నా 1.57 రెట్లు ఎక్కువగా పెరిగిందన్న భావన కలుగుతుంది. సింగపూర్‌ విమానంలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. 
  • అదే సమయంలో ఆ లోహ విహంగంలో ప్రకంపనలు మొదలయ్యాయి. విమానం 37,362 అడుగుల ఎత్తుకు చేరింది. ఈ దశలో ఆ లోహవిహంగంలోని ఆటోపైలట్‌ వ్యవస్థ.. దాన్ని నిర్దేశిత క్రూజ్‌ ఎత్తుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. ఈ గందరగోళం నడుమ.. సీటు బెల్ట్‌లు పెట్టుకోవాలంటూ ప్రయాణికులకు పైలట్లు సూచనలు ఇచ్చారు. 
  • 8 సెకన్ల తర్వాత విమానం.. జీ బలాల్లో తీవ్రస్థాయి వైరుధ్యాలు వచ్చాయి. 0.6 సెకన్లలోనే +1.35జీ నుంచి మైనస్‌ 1.5జీకి అవి మారాయి. నెగెటివ్‌ జీ బలాల వల్ల ప్రయాణికులకు గాల్లో తేలియాడున్న భావన కలుగుతుంది. అప్పటికే సీటు బెల్టు పెట్టుకోని ప్రయాణికులు.. గాల్లో పైకి లేచారు. ఆ తర్వాత నాలుగు సెకన్లలోనే జీ బలాలు +1.5జీకి చేరాయి. దీనివల్ల విమానం ప్రయాణిస్తున్న ఎత్తు 37,362 అడుగుల నుంచి 37,184 అడుగులకు పడిపోయింది. ఫలితంగా ప్రయాణికులంతా సీట్లలో పడిపోయారు. 
  • 4.6 సెకన్ల వ్యవధిలో గురుత్వాకర్షణ బలాల్లో వేగంగా వచ్చిన మార్పుల వల్ల 178 అడుగుల మేర విమానం ఎత్తు తగ్గిపోయింది. ఈ ఘటనల్లో ప్రయాణికులు, సిబ్బందికి గాయాలయ్యాయి. 
  • ఈ సమయంలో పైలట్లు విమానాన్ని నియంత్రణలోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఆటోపైలట్‌ వ్యవస్థను నిలిపివేశారు. విమానాన్ని బ్యాంకాక్‌లోని సువర్ణభూమి ఎయిర్‌పోర్టుకు మళ్లించారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని