భద్రతా మండలికి పాక్, డెన్మార్క్, గ్రీస్, పనామా, సోమాలియా

భద్రతా మండలిలో రెండేళ్ల సభ్యత్వం కోసం గురువారం జరిగిన రహస్య బ్యాలట్‌లో పాకిస్థాన్, డెన్మార్క్, గ్రీస్, పనామా, సోమాలియాలు గెలుపొందనున్నాయి.

Published : 07 Jun 2024 04:59 IST

రెండేళ్ల పాటు కొనసాగనున్న సభ్యత్వాలు

ఐక్యరాజ్యసమితి: భద్రతా మండలిలో రెండేళ్ల సభ్యత్వం కోసం గురువారం జరిగిన రహస్య బ్యాలట్‌లో పాకిస్థాన్, డెన్మార్క్, గ్రీస్, పనామా, సోమాలియాలు గెలుపొందనున్నాయి. 193 సభ్య దేశాలు గల ఐరాస జనరల్‌ అసెంబ్లీ ఈ అయిదు దేశాలను ఎంపిక చేయడం ఖాయమే. భద్రతామండలిలో మొత్తం 15 సీట్లు ఉండగా, వాటిలో అయిదు వీటో అధికారం గల శాశ్వత సభ్య దేశాలు. అవి- అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్‌. మిగతా 10 దేశాలను రెండేళ్లపాటు తాత్కాలిక సభ్యులుగా ఎన్నుకుంటారు. ఈ సీట్లను ప్రాంతాల వారీగా కేటాయిస్తారు. ఈసారి ఆఫ్రికా బృందం సోమాలియాను ప్రతిపాదించింది. ఆసియా-పసిఫిక్‌ దేశాల తరఫున పాకిస్థాన్‌ను ప్రతిపాదించారు. లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ గ్రూపు పనామా పేరును ప్రతిపాదించింది. డెన్మార్క్, గ్రీస్‌లు ఐరోపా తరఫున నామినేట్‌ అయ్యాయి. ఈ కొత్త తాత్కాలిక సభ్య దేశాల పదవీకాలం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఆరంభమవుతుంది. ప్రస్తుత తాత్కాలిక సభ్యదేశాలు జపాన్, మొజాంబిక్, ఈక్వెడార్, మాల్టా, స్విట్జర్లాండ్‌ల పదవీ కాలం ఈ ఏడాది డిసెంబరు 31న ముగుస్తుంది. భద్రతా మండలిని 21వ శతాబ్ది అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా విస్తరించాలని భారత్‌తో సహా అన్ని సమితి సభ్యదేశాలు కోరుతున్నా ఇంతవరకు అడుగు ముందుకుపడటం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని