తీవ్ర శారీరక శ్రమతో డిమెన్షియాకు కళ్లెం!

అధిక రక్తపోటు కలిగిన వయోధికులు శారీరక శ్రమతో తీవ్ర మతిమరుపు (డిమెన్షియా) ముప్పును తగ్గించుకోవచ్చని తాజా పరిశోధన గుర్తించింది.

Published : 08 Jun 2024 06:43 IST

దిల్లీ: అధిక రక్తపోటు కలిగిన వయోధికులు శారీరక శ్రమతో తీవ్ర మతిమరుపు (డిమెన్షియా) ముప్పును తగ్గించుకోవచ్చని తాజా పరిశోధన గుర్తించింది. అమెరికాలోని వేక్‌ ఫారెస్ట్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దీన్ని చేపట్టారు. అధిక రక్తపోటు వల్ల విషయగ్రహణ సామర్థ్యం సన్నగిల్లుతుందని మునుపటి అధ్యయనాల్లో వెల్లడైంది. ఫలితంగా తీవ్ర మతిమరుపు కూడా తలెత్తవచ్చని తేలింది. ఈ నేపథ్యంలో.. అధికరక్తపోటు కలిగిన వృద్ధులకు విషయగ్రహణ సామర్థ్యంలో స్వల్పస్థాయి క్షీణత ముప్పును తగ్గించుకోవడానికి శారీరక శ్రమ ఉపయోగపడుతుందా అన్నది శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ క్షీణత.. డిమెన్షియాకు ముందు దశ. వారానికి కనీసం ఒక్కసారి తీవ్రస్థాయి శారీరక శ్రమలో నిమగ్నమైనవారు విషయగ్రహణ సామర్థ్యంలో ఒక మోస్తరు స్థాయి క్షీణత బారినపడే అవకాశం తక్కువని గుర్తించారు. పరీక్షార్థుల వయసు 50 ఏళ్లపైబడి ఉంది. తీవ్ర వ్యాయామంతో కలిగే ప్రయోజనం.. 75 ఏళ్ల లోపువారికి చాలా ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని