నెత్తురోడుతున్న గాజా

సెంట్రల్‌ గాజాలో శనివారం నలుగురు బందీల విడుదల కోసం ఇజ్రాయెల్‌ చేపట్టిన ఆపరేషన్‌లో ఏకంగా 274 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. దాదాపు 700 మంది గాయాల పాలయ్యారు.

Updated : 10 Jun 2024 05:43 IST

నలుగురు బందీల విడుదల కోసం జరిగిన ఆపరేషన్‌లో 274 మంది మృతి
700 మందికి పైగా గాయాలు

దేర్‌-అల్‌-బలాహ్‌: సెంట్రల్‌ గాజాలో శనివారం నలుగురు బందీల విడుదల కోసం ఇజ్రాయెల్‌ చేపట్టిన ఆపరేషన్‌లో ఏకంగా 274 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. దాదాపు 700 మంది గాయాల పాలయ్యారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు. ఈ విషయాన్ని గాజా పాలస్తీనా ఆరోగ్య విభాగం తెలిపింది. తొలుత ఈ ఆపరేషన్‌లో 100 మంది చనిపోయారని ఇజ్రాయెల్‌ పేర్కొంది. అయితే ఈ సంఖ్య 274కు చేరింది. బాధితుల హాహాకారాలతో అల్‌-అఖ్సా ఆసుపత్రి నిండిపోయినట్లు ఓ స్వచ్ఛంద సంస్థ తెలిపింది. ఆదివారం సెంట్రల్‌ గాజాలోని నుసీరాత్‌ శరణార్థి శిబిరంలోని రెండు వేర్వేరు ప్రదేశాలపై దాడి చేసి హమాస్‌ చెరలోని నలుగురు బందీలను ఇజ్రాయల్‌ ప్రత్యేక దళాలు రక్షించిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో భారీగా ప్రాణనష్టం సంభవించడంపై అంతర్జాతీయంగా ఇజ్రాయెల్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బందీలను రక్షించే సమయంలో బలగాలపై భారీఎత్తున దాడులు జరిగాయని ఇజ్రాయెల్‌ సైన్యం అధికార ప్రతినిధి డేనియల్‌ హగారీ తెలిపారు ఆపరేషన్‌లో ఓ అధికారి మృతి చెందినట్లు చెప్పారు.

‘‘నుసీరాత్‌లోని రెండు వేర్వేరు అపార్ట్‌మెంట్‌లలో బందీలను ఉంచారు. వాటి మధ్య దాదాపు 200 మీటర్ల దూరం ఉంది. రెండు భవంతుల్లోకి మా బలగాలు ఒకే సమయంలో ప్రవేశించాయి. అయితే.. వారిపై పెద్దఎత్తున దాడులు జరిగాయి. పరిసరాల నుంచి రాకెట్‌ గ్రనేడ్‌లు ప్రయోగించారు. దీంతో బలగాలను, బందీలను రక్షించేందుకు ప్రతిచర్యలు తీసుకున్నాం’’ అని వివరించారు. గత ఏడాది అక్టోబరులో హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేశారు. ఈ క్రమంలోనే దాదాపు 250 మందిని కిడ్నాప్‌ చేసి గాజాకు తరలించారు. నవంబరులో ఇరుపక్షాల నడుమ కాల్పుల విరమణ సమయంలో కొంతమందిని విడిచిపెట్టారు. ఇంకా 120 మంది హమాస్‌ చెరలో ఉన్నారని ఇజ్రాయెల్‌ చెబుతోంది. వారిని గాజాలోని జనసమ్మర్థ ప్రదేశాలు, సొరంగాల్లో ఉంచినట్లు సమాచారం. దీంతో.. వారిని కాపాడటం టెల్‌అవీవ్‌కు సవాల్‌గా మారుతోంది. ఫిబ్రవరిలోనూ ఇదే తరహా ఓ ఆపరేషన్‌ నిర్వహించి, ఇద్దరు బందీలను కాపాడగా.. ఈ క్రమంలో 74 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు.

శ్వేత సౌధాన్ని చుట్టుముట్టిన పాలస్తీనా మద్దతుదారులు

అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధ పరిసరాలు నిరసనలతో దద్దరిల్లాయి. గాజా-ఇజ్రాయెల్‌ యుద్ధం ముగించాలని, టెల్‌అవీవ్‌కు అగ్రరాజ్యం మద్దతు ఆపేయాలంటూ ఆందోళన జరిగింది. దాదాపు 35,000 మంది నిరసనకారులు ఇందులో పాల్గొన్నారు. పాలస్తీనాకు విముక్తి కలిగించాలని, ఇజ్రాయెల్‌కు అమెరికా సైనిక సాయం ఆపేయాలని నినాదాలు చేశారు. 

బ్రిటన్‌ యుద్ధనౌకపై హూతీల దాడి

ఎర్రసముద్రంలో బ్రిటన్‌ విధ్వంసక యుద్ధనౌక హెచ్‌ఎమ్‌ఎస్‌ డైమండ్‌పై బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించినట్లు ఆదివారం యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు పేర్కొన్నారు. తమ క్షిపణి.. లక్ష్యాన్ని కచ్చితంగా తాకినట్లు తెలిపింది. మరో రెండు వాణిజ్యనౌకలపైనా దాడి చేసినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని