ఖలిస్థానీ తీవ్రవాది నిజ్జర్‌ హత్యకేసు.. భారత్‌లో కెనడా ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ రహస్య పర్యటనలు!

ఖలిస్థానీ తీవ్రవాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్యకేసుకు సంబంధించిన విషయాలను భారతీయ అధికారులకు తెలియజేసేందుకు కెనడా ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ చీఫ్‌ డేవిడ్‌ విగ్నాల్ట్‌ గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో రెండుసార్లు భారత్‌లో రహస్య పర్యటనలు జరిపినట్లు సంబంధింత వర్గాలు తెలిపాయి.

Published : 10 Jun 2024 05:19 IST

దిల్లీ: ఖలిస్థానీ తీవ్రవాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్యకేసుకు సంబంధించిన విషయాలను భారతీయ అధికారులకు తెలియజేసేందుకు కెనడా ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ చీఫ్‌ డేవిడ్‌ విగ్నాల్ట్‌ గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో రెండుసార్లు భారత్‌లో రహస్య పర్యటనలు జరిపినట్లు సంబంధింత వర్గాలు తెలిపాయి. ఈ హత్య విషయమై ఒట్టావా దర్యాప్తులో వెల్లడైన సమాచారాన్ని కెనడియన్‌ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ (సీఎస్‌ఐఎస్‌) చీఫ్‌ విగ్నాల్ట్‌ మన అధికారులతో పంచుకొన్నట్లు తెలిసింది. నిజ్జర్‌ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉండే అవకాశముందంటూ గతేడాది సెప్టెంబరులో కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరు దేశాల నడుమ సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్రూడో ఆరోపణలు అసంబద్ధమైనవిగా భారత్‌ ఖండించింది. నిజ్జర్‌ హత్యకేసుతో సంబంధం ఉందంటూ ముగ్గురు భారతీయ యువకులను కెనడా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్టులకు కొన్ని వారాల ముందు విగ్నాల్ట్‌ భారత్‌లో పర్యటించారు. తదనంతరం నాలుగో భారతీయుడైన అమన్‌దీప్‌ సింగ్‌ను కూడా కెనడా అధికారులు అరెస్టు చేశారు. ఉగ్రవాదిగా భారతదేశం ప్రకటించిన నిజ్జర్‌ను గతేడాది జూన్‌లో కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా ప్రావిన్సులో గల ఓ గురుద్వారా బయట కొందరు కాల్చి చంపారు. 

కెనడాలోని వాంకోవర్‌లో గత వారం కొందరు ఖలిస్థానీ మద్దతుదారులు భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య చిత్రాలను ప్రదర్శించడంపై కెనడా పబ్లిక్‌సేఫ్టీ మంత్రి డొమనిక్‌ ఎల్‌ లిబ్లెన్స్‌ స్పందించారు. హింసను ప్రేరేపించే పనులను తాము ఏమాత్రం ఆమోదించబోమని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని