కాల్పుల విరమణ ప్రతిపాదనలకు అంగీకరించండి

పరస్పర దాడులు చేసుకుంటున్న ఇజ్రాయెల్, హమాస్‌లకు పోప్‌ ఫ్రాన్సిస్‌ కీలక సూచనలు చేశారు. మానవతా సాయాన్ని గాజాలోని పౌరులకు అందేలా సహకరించాలని ఇజ్రాయెల్‌ను ఆయన కోరారు.

Published : 10 Jun 2024 06:41 IST

హమాస్, ఇజ్రాయెల్‌లకు పోప్‌ సూచన

వాటికన్‌ సిటీ: పరస్పర దాడులు చేసుకుంటున్న ఇజ్రాయెల్, హమాస్‌లకు పోప్‌ ఫ్రాన్సిస్‌ కీలక సూచనలు చేశారు. మానవతా సాయాన్ని గాజాలోని పౌరులకు అందేలా సహకరించాలని ఇజ్రాయెల్‌ను ఆయన కోరారు. అలాగే కాల్పుల విరమణ ప్రతిపాదనలకు అంగీకరించి బందీలను విడిచిపెట్టేందుకు ఒప్పుకోవాలని హమాస్‌కు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ప్రార్థనల్లో ఆయన ఈ మేరకు అభిలషించారు. మానవతా సహాయ నిధిపై అంతర్జాతీయ సదస్సును నిర్వహించనున్నందుకు జోర్డాన్‌కు పోప్‌ కృతజ్ఞతలు తెలిపారు. తాను గతంలో ప్రారంభించిన పీస్‌ ప్రేయర్‌ కార్యక్రమానికి శనివారంతో 10 ఏళ్లు పూర్తయినట్లు పోప్‌ వెల్లడించారు. అదే కార్యక్రమానికి అప్పటి ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు షిమోన్‌ పెరెస్, పాలస్తీనా నాయకుడు మొహమ్మద్‌ అబ్బాస్‌ వచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ‘చేతులు కలపడం సాధ్యమే. అయితే దానికి యుద్ధం చేయడానికన్నా ఎక్కువ ధైర్యం ఉండాలి’ అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 


పాకిస్థాన్‌లో ఐదో పోలియో కేసు గుర్తింపు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో 17 రోజుల క్రితం మరణించిన రెండేళ్ల చిన్నారికి పోలియో వ్యాధి ఉన్నట్లు ఆ దేశం నిర్ధారించింది. ఇలాంటి కేసును గుర్తించడం ఈ ఏడాదిలో ఐదోది. బలూచిస్థాన్‌లోని క్వెట్టాకు చెందిన సదరు చిన్నారి ఏప్రిల్‌ 22న పక్షవాతానికి గురి కాగా ఆరు వారాల తర్వాత వ్యాధిని నిర్ధారించారని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ (ఎన్‌ఐహెచ్‌) రీజినల్‌ రిఫరెన్స్‌ ల్యాబొరేటరీ అధికారి తెలిపారు. చిన్నారి బాలుడికి పోలియో టీకా వేయకపోగా.. మొత్తం ఐదు డోసులు వేసినట్లు రికార్డుల్లో ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఆ అధికారి చెప్పారు. ఈ వ్యాధి చిన్నారి కుటుంబసభ్యులకూ సోకిందని నిర్ధారించారు. మరోవైపు, పోలియో ఉన్న దేశాలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌లను గుర్తించిన సంగతి తెలిసిందే.


ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడిలో రష్యా ఎస్‌యూ-57 ధ్వంసం

కీవ్‌: తాము ఇచ్చిన ఆయుధాలను రష్యా భూభాగంలోనూ వాడొచ్చంటూ ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు సంకేతాలిస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆదివారం దక్షిణ రష్యాలో ఆస్ట్రాఖాన్‌ ప్రాంతంలోని వైమానిక స్థావరంలో నిలిపి ఉంచిన అత్యాధునిక ఎస్‌యూ-57 యుద్ధ విమానాన్ని ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. రష్యా అమ్ములపొదిలో ఇది కీలక యుద్ధ విమానం. 2020లో ఇది సైన్యంలో చేరింది. యుద్ధం తీరును ఈ దాడి మలుపు తిప్పుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ దేశాల ఆయుధాలను తమపైకి ఉక్రెయిన్‌ ప్రయోగిస్తే.. తాము కూడా అమెరికా దాని మిత్ర పక్షాల శత్రువులకు ఆయుధాలు అందిస్తామని ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే. డ్రోన్‌తోనే ఈ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఉపగ్రహచిత్రాలను కూడా ఉక్రెయిన్‌ నిఘా విభాగం విడుదల చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని