గర్భిణుల్లో కుంగుబాటును ముందే పసిగట్టే యాప్‌

గర్భిణికి కాన్పు అయ్యేలోగా మానసిక కుంగుబాటు సమస్య తలెత్తుతుందా అన్నది ముందుగానే పసిగట్టే ఒక మొబైల్‌ యాప్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

Published : 11 Jun 2024 05:13 IST

దిల్లీ: గర్భిణికి కాన్పు అయ్యేలోగా మానసిక కుంగుబాటు సమస్య తలెత్తుతుందా అన్నది ముందుగానే పసిగట్టే ఒక మొబైల్‌ యాప్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ సమస్య ఉన్నవారిని గుర్తించి, నివారణ చర్యలు చేపట్టడానికి ఇది వీలు కల్పిస్తుందని వారు పేర్కొన్నారు. అమెరికాలోని పిట్స్‌బర్గ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. మూడు నెలల గర్భంతో ఉన్న మహిళలను సర్వే చేసిన పరిశోధకులు.. కుంగుబాటుకు సంబంధించిన కొన్ని ముప్పు అంశాలను గుర్తించారు. అందులో నిద్ర నాణ్యత, ఆహార భద్రత లేకపోవడం వంటివి ఉన్నాయి. మొత్తం 944 మంది మహిళల నుంచి వివరాలు సేకరించారు. ఈ డేటాను ఉపయోగించి, శాస్త్రవేత్తలు ఆరు మెషీన్‌ లెర్నింగ్‌ మోడళ్లను అభివృద్ధి చేశారు. ఇందులో ఒకటి.. గర్భిణుల్లో తలెత్తబోయే కుంగుబాటును అంచనావేయడంలో 89 శాతం కచ్చితత్వం ప్రదర్శించినట్లు గుర్తించారు. మెషీన్‌ లెర్నింగ్‌ అల్గోరిథమ్‌ అనేది ఒకరకమైన కృత్రిమ మేధ సాధనం. అది పాత డేటాను విశ్లేషించి, భవిష్యత్‌ అంచనాలను ఎలా వేయాలో నేర్చుకుంటుంది. కుంగుబాటుకు దారితీసే అనేక ముప్పు అంశాలను సులువుగానే తగ్గించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. కాన్పు గురించి ఆందోళన, ఆహార లభ్యత సమస్య వంటివి ఇందులో ఉన్నాయని వివరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని