ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో అతి మితవాదుల హవా

ఐరోపా పార్లమెంటుకు తాజాగా జరిగిన ఎన్నికలు యురోపియన్‌ యూనియన్‌ (ఈయూ)లో ప్రకంపనలు సృష్టించేలా కనిపిస్తున్నాయి.

Published : 11 Jun 2024 05:14 IST

జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీల్లో వారిదే పైచేయి 

బ్రస్సెల్స్‌: ఐరోపా పార్లమెంటుకు తాజాగా జరిగిన ఎన్నికలు యురోపియన్‌ యూనియన్‌ (ఈయూ)లో ప్రకంపనలు సృష్టించేలా కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో అతి మితవాద పార్టీల సీట్ల సంఖ్య భారీగా పెరగడం దాదాపుగా ఖాయమైంది. ఈయూలో అత్యంత కీలక దేశాలైన ఫ్రాన్స్, జర్మనీల్లో అధికార పక్షాలకు షాక్‌ ఇస్తూ ఫార్‌ రైట్‌ పార్టీలు తమ ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకున్నాయి. జర్మనీలో ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ నేతృత్వంలోని సోషల్‌ డెమోక్రాట్స్‌ పార్టీకి ఓట్లు భారీగా తగ్గాయి. అక్కడ ‘ఆల్టర్నేటివ్‌ ఫర్‌ జర్మనీ’ పార్టీ తన ఓట్ల శాతాన్ని 16.5%కు పెంచుకుంది! ఇటలీలో ప్రధానమంత్రి మెలోనీకి చెందిన అతి మితవాద పార్టీ ‘బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ’.. ఐరోపా పార్లమెంటులో తమ సీట్ల సంఖ్యను రెట్టింపునకు పైగా పెంచుకునే స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించింది. ఫ్రాన్స్‌లో అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ నాయకత్వంలోని ‘రినైజన్స్‌’ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దాని ఓట్ల శాతం 14.8%-15.2% మధ్యే ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో విపక్ష ఫార్‌ రైట్‌ పార్టీ ‘నేషనల్‌ ర్యాలీ’ 31%-32% వరకూ ఓట్లను ఖాతాలో వేసుకోవడం దాదాపు ఖాయమైంది. పార్లమెంటులో అతి మితవాదుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో ఇకపై ఈయూలో కీలక విధాన నిర్ణయాలు తీసుకోవడం సంక్లిష్ట ప్రక్రియగా మారుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 


ఫ్రాన్స్‌ పార్లమెంటు రద్దు.. 

ముందస్తు ఎన్నికలకు మెక్రాన్‌ నిర్ణయం 

రోపా పార్లమెంటు ఎన్నికల్లో తన పార్టీ రినైజన్స్‌కు ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. దేశ పార్లమెంటును రద్దు చేసి.. ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. అధ్యక్షుడిగా తన పదవీకాలం ముగిసేదాకా (2027) వేచి చూస్తే.. విపక్ష నేషనల్‌ ర్యాలీ పార్టీ మరింత పుంజుకుంటుందన్న గుబులుతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాన్ని ‘నేషనల్‌ ర్యాలీ’ స్వాగతించింది. దాదాపుగా నెల రోజుల్లోనే ఎన్నికలు ముగియనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని