సంక్షిప్త వార్తలు (5)

అల్‌ షహాబ్‌ అతివాద సంస్థ సోమవారం సోమాలియాలోని బెలెద్వెనే ప్రాంతంలో జరిపిన దాడిలో 20 మంది ప్రాణాలు కోల్పోగా 36 మంది గాయపడ్డారు. మృతుల్లో ఒక మంత్రి, మరో డిప్యూటీ గవర్నర్‌ ఉన్నారు.

Updated : 04 Oct 2022 06:11 IST

సోమాలియాలో అతివాదుల దాడి.. 20 మంది మృతి

మొగదిషు: అల్‌ షహాబ్‌ అతివాద సంస్థ సోమవారం సోమాలియాలోని బెలెద్వెనే ప్రాంతంలో జరిపిన దాడిలో 20 మంది ప్రాణాలు కోల్పోగా 36 మంది గాయపడ్డారు. మృతుల్లో ఒక మంత్రి, మరో డిప్యూటీ గవర్నర్‌ ఉన్నారు. స్థానిక సంస్థ కార్యాలయ ప్రవేశమార్గం వద్ద మొదట పేలుడు సంభవించిందనీ, ఆ వెంటనే పేలుడు పదార్థాలతో నిండిన ఒక భారీ ట్రక్కు అక్కడకు దూసుకువచ్చి తన కళ్లెదుటే పేలిపోయిందని హిరాన్‌ గవర్నర్‌ ఆలీ జైతే ఒస్మాన్‌ తెలిపారు. దాడుల్లో ఆ భవనం పూర్తిగా దెబ్బతిందని చెప్పారు. అల్‌ షహాబ్‌ అగ్రనేత అబ్దుల్లాహి నదిర్‌ను తమ బలగాలు మట్టుబెట్టాయని సోమాలియా ప్రభుత్వం అంతకుముందు ప్రకటించింది. నైరుతి సోమాలియాలో శనివారం గగనతల దాడి నిర్వహించినట్లు అమెరికా సైన్యం ప్రకటించినా ఈ నేత విషయాన్ని ప్రస్తావించలేదు.


‘అమెరికా, ఇజ్రాయెల్‌ కుట్రతోనే ఇరాన్‌లో అల్లర్లు’

దుబాయ్‌: ఇరాన్‌లో కొన్ని వారాలుగా పెద్దఎత్తున కొనసాగుతున్న నిరసనలపై ఆ దేశ అగ్ర నేత అయతుల్లా అలీ ఖమేనెయ్‌ సోమవారం తొలిసారిగా స్పందించారు. ఈ నిరసనలను ‘అల్లర్లు’గా పేర్కొన్న ఆయన.. వీటి వెనుక అమెరికా, ఇజ్రాయెల్‌ ఉన్నాయని ఆరోపించారు. ఆ దేశాలు పథకం ప్రకారమే కుట్రపూరితంగా ఆందోళనలను ఎగదోస్తున్నాయంటూ మండిపడ్డారు. ఆ దేశానికి చెందిన మాసా అమీని అనే యువతి హిజాబ్‌ సరిగా ధరించనందుకు మూడు వారాల క్రితం పోలీసులు అరెస్టు చేయగా, వారి కస్టడీలో మరణించడం అక్కడ ఆగ్రహజ్వాలలను రగిలించింది. అప్పటి నుంచి ఆ దేశం ఆందోళనలు, నిరసనలతో అట్టుడుకుతోంది. తాజాగా టెహ్రాన్‌లోని షరీఫ్‌ టెక్నాలజీ యూనివర్సిటీలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. విద్యార్థులు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు వందల సంఖ్యలో విద్యార్థులను అరెస్టు చేశారు. అధికారులు వర్సిటీ గేట్లను మూసివేశారు. ఈ ఘర్షణల నేపథ్యంలో అయతుల్లా టెహ్రాన్‌లో కొందరు విద్యార్థులతో మాట్లాడారు. పోలీసు కస్టడీలో 22 ఏళ్ల యువతి మరణించిన ఘటన తనను కలిచివేసిందని, ఇది దురదృష్టకరమైన, విషాద ఘటన అని అన్నారు. అయితే అమెరికా, దానికి వత్తాసు పలుకుతున్న దేశాలే ఇరాన్‌లో ఆందోళనలకు, ప్రజల్లో అభద్రతాభావం పెంచడానికి ఉద్దేశపూర్వకంగా కుట్రపన్నుతున్నాయని విరుచుకుపడ్డారు.


గృహనిర్బంధంలో ప్రాణాలు కోల్పోయిన రష్యా శాస్త్రవేత్త

సెయింట్‌పీటర్స్‌బర్గ్‌: ధ్రువ ప్రాంతాల అధ్యయనంలో పేరొందిన రష్యా శాస్త్రవేత్త వలెరీ మిట్కో (81).. దేశద్రోహ అభియోగాలపై గృహ నిర్బంధంలో ఉంటూ సోమవారం ప్రాణాలు కోల్పోయారు. ఆయన కొద్దిరోజుల క్రితమే ఆసుపత్రి నుంచి విడుదలై నడవలేని స్థితికి చేరుకున్నారని మానవ హక్కుల విభాగం తెలిపింది. ఆర్కిటిక్‌ ప్రాంతంపై కీలక పరిశోధనలు చేసిన ఆయన 2018లో చైనా పర్యటనకు వెళ్లినప్పుడు సున్నితమైన సమాచారాన్ని ఆ దేశానికి చేరవేశారనే ఆరోపణలు వచ్చాయి. వాటిని ఆయన తోసిపుచ్చారు. 2020 ఫిబ్రవరి నుంచి గృహ నిర్బంధంలో ఉన్నారు.


మహిళా జడ్జిని బెదిరించిన కేసులో ఇమ్రాన్‌ ఖాన్‌కు ఊరట

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ పదవీచ్యుత ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు ఇస్లామాబాద్‌ హైకోర్టు నుంచి ఊరట లభించింది. ఆగస్టులో నిర్వహించిన ఓ ర్యాలీలో జెబ్రా చౌధ్రి అనే మహిళా న్యాయమూర్తిని బెదిరిస్తూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆయనకు జారీ చేసిన షోకాజ్‌ నోటీసును కోర్టు సోమవారం ఉపసంహరించుకుంది. దీంతో ఆయనకు ధిక్కార అభియోగాల నుంచి ఉపశమనం లభించింది. తద్వారా వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడయ్యే ముప్పు తప్పింది. ఈ కేసుకు సంబంధించి ఆయన ఇదివరకే తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతూ అఫిడవిట్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఈ కేసును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మినల్లా ఆధ్వర్యంలోని విస్తృత ధర్మాసనం విచారించింది. దీనికి ఇమ్రాన్‌ ఖాన్‌ స్వయంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇమ్రాన్‌ క్షమాపణ, ఆయన వ్యవహార శైలిపై ధర్మాసనం సంతృప్తి చెందిందని, ఆయనకు జారీ చేసిన షోకాజ్‌ నోటీసును ఉపసంహరించుకోవాలని ఏకగ్రీవంగా తీర్పునిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని