ఇంధన సరఫరాపై ఆంక్షలొద్దు

రష్యా నుంచి భారత్‌ సహా కొన్ని దేశాలు తక్కువ ధరకే చమురు కొనుగోలు చేస్తుండటంపై పశ్చిమ దేశాలు గుర్రుగా ఉన్నవేళ జి-20 సదస్సు వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన సరఫరాపై ఆంక్షలు విధించడం ఎంతమాత్రమూ సరికాదని సూటిగా చెప్పారు.

Published : 16 Nov 2022 06:01 IST

విపణిలో స్థిరత్వ సాధనకు కృషిచేద్దాం  
జి-20 సదస్సులో ప్రధాని మోదీ పిలుపు

బాలి: రష్యా నుంచి భారత్‌ సహా కొన్ని దేశాలు తక్కువ ధరకే చమురు కొనుగోలు చేస్తుండటంపై పశ్చిమ దేశాలు గుర్రుగా ఉన్నవేళ జి-20 సదస్సు వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన సరఫరాపై ఆంక్షలు విధించడం ఎంతమాత్రమూ సరికాదని సూటిగా చెప్పారు. మార్కెట్‌లో స్థిరత్వ సాధనకు కృషిచేయాలని ప్రపంచ నేతలకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధికి భారత్‌లో చమురు భద్రత కీలకమని ఆయన పేర్కొన్నారు. రష్యా, ఉక్రెయిన్‌ కాల్పుల విరమణ పాటించాలని.. అవి తమ ఘర్షణను దౌత్యమార్గంలో పరిష్కరించుకోవాలని మోదీ మరోసారి పిలుపునిచ్చారు. పర్యావరణ మార్పులు, కొవిడ్‌ మహమ్మారికి తోడు ఉక్రెయిన్‌ పరిణామాల కారణంగా అంతర్జాతీయ సరఫరా గొలుసులు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఒకింత ఆవేదన వ్యక్తంచేశారు. ఇండోనేసియాలోని బాలి వేదికగా జరుగుతున్న జి-20 సదస్సులో మోదీ మంగళవారం ఈ మేరకు ప్రసంగించారు.

ఆహార, ఇంధన భద్రత అంశంపై జరిగిన చర్చలో మోదీ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర సరకుల సంక్షోభం నెలకొంది. ఇంధన సరఫరాపై మనం ఆంక్షలేవీ విధించకూడదు. మార్కెట్‌లో స్థిరత్వం సాధించే దిశగా పనిచేయాలి’’ అని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని అమెరికా సహా పశ్చిమ దేశాలు కొన్ని నెలలుగా పిలుపునిస్తున్నాయి. అయితే భారత్‌ రాయితీ ధరలకు ఆ దేశం నుంచి ముడి చమురును కొంటోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ తదితర నేతల సమక్షంలో.. జి-20 వేదికగా మోదీ చమురు సరఫరాపై ఆంక్షలను వ్యతిరేకిస్తూ మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది.  

మన భుజాలపై గురుతర బాధ్యత

ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని దౌత్య మార్గంలో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలంటూ గతంలోనే పలుమార్లు తాను పిలుపునిచ్చిన సంగతిని మోదీ గుర్తుచేశారు. ‘‘రెండో ప్రపంచ యుద్ధం గత శతాబ్దంలో ప్రపంచానికి తీరని నష్టం చేసింది. ఆ తర్వాత అప్పటి నేతలు శాంతిబాటలో ప్రయాణించేందుకు కృషిచేశారు. ఇప్పుడు మన వంతు వచ్చింది. కొవిడ్‌ తర్వాతి కాలంలో ప్రపంచాన్ని తిరిగి గాడిన పెట్టాల్సిన గురుతర బాధ్యత మన భుజాలపై ఉంది. గౌతమ బుద్ధుడు, మహాత్మాగాంధీ నడయాడిన పవిత్ర భారతదేశంలో వచ్చే ఏడాది జి-20 నేతలు సమావేశం కానున్నారు. శాంతిపై ప్రపంచానికి బలమైన సందేశమిచ్చేందుకు అక్కడ మనం అంగీకరిస్తామని నాకు పూర్తి విశ్వాసం ఉంది’’ అని పేర్కొన్నారు.

నిత్యావసర సరకుల కొరత కారణంగా ప్రపంచవ్యాప్తంగా పేదలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారని మోదీ అన్నారు. ‘‘అంతర్జాతీయంగా పలు సమస్యల విషయంలో ఐక్యరాజ్య సమితి వంటి బహుళ దేశ సంస్థలు విజయవంతం కాలేదని చెప్పేందుకు మనం సంకోచించకూడదు. అలాంటి సంస్థల్లో తగిన సంస్కరణలు తీసుకురావడంలో మనమంతా విఫలమయ్యాం. అందుకే ప్రస్తుత ప్రపంచం జి-20పై ఎక్కువ అంచనాలు పెట్టుకుంది’’ అని వ్యాఖ్యానించారు.

నేటి ఎరువుల కొరత.. రేపటి ఆహార సంక్షోభం

కొవిడ్‌ విజృంభణ వేళ భారత్‌ 130 కోట్లకుపైగా సొంత పౌరుల ఆహార భద్రతను చూసుకుంటూనే.. అనేక దేశాలకు ఆహార ధాన్యాలను సరఫరా చేసిందని ప్రధాని గుర్తుచేశారు. ప్రస్తుతం ఎరువుల కొరత సంక్షోభ స్థితికి చేరుకుందని అన్నారు. ‘‘నేటి ఎరువుల కొరత రేపు ఆహార సంక్షోభంగా రూపుదాల్చుతుంది. అప్పుడు ప్రపంచం వద్ద పరిష్కార మార్గాలు కరవవుతాయి. ఎరువులు, ఆహార ధాన్యాల సరఫరా స్థిరంగా కొనసాగేందుకు మనం పరస్పర సహకార ఒప్పందాలు చేసుకోవాలి’’ అని పిలుపునిచ్చారు.


పలకరించుకున్న మోదీ, జిన్‌పింగ్‌

ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ బాలిలో ఒకరినొకరు పలకరించుకోవడం తాజాగా ప్రాధాన్యం సంతరించుకుంది. జి-20 సదస్సుకు విచ్చేసిన కీలక నేతల కోసం ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో మంగళవారం స్వాగత విందును ఏర్పాటుచేశారు. విందు ముగిసే సమయంలో ఎదురుపడ్డప్పుడు మోదీ, జిన్‌పింగ్‌ కరచాలనం చేసుకున్నారు. కొద్దిసేపు మాట్లాడుకున్నారు. సంబంధిత వీడియో ఒకటి బయటికొచ్చింది. 2020 జూన్‌లో గల్వాన్‌ ఘర్షణలు చోటుచేసుకున్నప్పటి నుంచీ మోదీ, జిన్‌పింగ్‌ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగలేదు.


సునాక్‌.. మెక్రాన్‌.. గీతా గోపీనాథ్‌

జి-20 సదస్సు సందర్భంగా బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ సహా పలువురు ప్రపంచ స్థాయి నేతలను మోదీ కలిశారు. పలు అంతర్జాతీయ అంశాలపై వారితో కొద్దిసేపు చర్చించారు. సునాక్‌ ప్రధాని పీఠమెక్కాక.. మోదీతో ముఖాముఖి మాట్లాడటం ఇదే తొలిసారి. సెనగల్‌ అధ్యక్షుడు-ఆఫ్రికా సంఘం ఛైర్మన్‌ మాకీ సాల్‌, నెదర్లాండ్స్‌ ప్రధాని మార్క్‌ రుట్‌ తదితరులూ భారత ప్రధానితో మాట్లాడినవారిలో ఉన్నారు. ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టలినా జార్జీవా, ఐఎంఎఫ్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌-భారత సంతతి ప్రముఖురాలు గీతా గోపీనాథ్‌, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్‌ మల్పాస్‌ తదితరులతో మోదీ బాలిలో కొద్దిసేపు చర్చించారు.


భారత్‌-అమెరికా సంబంధాలపై బైడెన్‌తో చర్చలు

ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మంగళవారం బాలిలో భేటీ అయ్యారు. కృత్రిమ మేధ, సంక్లిష్ట సాంకేతికతలు, అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ సహా పలు కీలక రంగాల్లో ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని వారు సమీక్షించారు. ఉక్రెయిన్‌ సంక్షోభం, దాని ప్రభావాలపై కూడా చర్చించారు. పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై మోదీ, బైడెన్‌ తమ సమావేశంలో సమాలోచనలు జరిపారని విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ద్వైపాక్షిక బంధం బలోపేతానికి నిరంతరం మద్దతుగా నిలుస్తున్నందుకుగాను బైడెన్‌కు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారని వెల్లడించింది. భారత్‌ జి-20 అధ్యక్ష పీఠమెక్కాక ఇరు దేశాలు సన్నిహిత సమన్వయంతో ముందుకు సాగుతాయని మోదీ విశ్వాసం వ్యక్తం చేసినట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని