Google: గూగులమ్మ ఇంట ఏఐ పంట

టెక్నాలజీ రంగంలో ఎక్కడ చూసినా కృత్రిమ మేధ (ఏఐ) హవానే. గూగుల్‌ వార్షిక డెవలపర్‌ సదస్సు ఏ/ఓ 2024 కూడా దీనికే పెద్ద పీట వేసింది. ఇటీవల జరిగిన ఈ సదస్సులో గొప్ప గొప్ప కృత్రిమ మేధ నమూనాలను ప్రదర్శించింది.

Updated : 22 May 2024 07:44 IST

టెక్నాలజీ రంగంలో ఎక్కడ చూసినా కృత్రిమ మేధ (ఏఐ) హవానే. గూగుల్‌ వార్షిక డెవలపర్‌ సదస్సు ఏ/ఓ 2024 కూడా దీనికే పెద్ద పీట వేసింది. ఇటీవల జరిగిన ఈ సదస్సులో గొప్ప గొప్ప కృత్రిమ మేధ నమూనాలను ప్రదర్శించింది. అభివృద్ధి చేస్తున్న టూల్స్‌నూ పరిచయం చేసింది. హోంవర్క్‌లో సాయం చేసే టూల్స్‌ దగ్గరి నుంచి పదాలతోనే సినిమా స్థాయి వీడియోను రూపొందించే మోడల్‌ వరకూ ఎన్నెన్నో వీటిలో ఉన్నాయి.  కొన్ని ఇప్పటికే వాడకంలోకి రాగా.. మరికొన్ని త్వరలో అందుబాటులోకి రానున్నాయి. అలాంటి అద్భుత టూల్స్, నమూనాల్లో కొన్ని ఇవీ..


అధునాతన అసిస్టెంట్‌

గూగుల్‌ డీప్‌మైండ్‌ రూపొందించిన ప్రాజెక్ట్‌ అస్త్ర మరో ఆకర్షణ. మున్ముందు అందుబాటులోకి రానున్న ఇదో అధునాతన యూనివర్సల్‌ ఏఐ అసిస్టెంట్‌. ప్రస్తుత ఛాట్‌బాట్ల కన్నా చాలా ముందంజలో ఉంటుంది. సంక్లిష్ట, చురుకైన ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ, స్పందిస్తూ రోజువారీ పనుల్లో చేదోడుగా నిలుస్తుంది. జెమినీ 1.5 ప్రొ మోడల్‌తో కూడిన ఇది వస్తువులను గుర్తించగలదు. కోడ్‌ను విశ్లేషించటం, వస్తువుల జాడను తెలియజేయటం, చివరికి మనమున్న చోటును గుర్తించటం వంటి పనులెన్నో ఇట్టే చేయగలదు. ఉదాహరణకు- ఫోన్‌తో వీడియో తీస్తూనే ప్రత్యక్షంగా అందులో ఏమేం కనిపిస్తున్నాయో చెప్పమని అడిగారనుకోండి. అన్నింటినీ ఏకరవు పెడుతుంది. ఆయా వస్తువులకు సంబంధించిన ప్రశ్నలను అడిగినా సమాధానాలు చెప్పేస్తుంది. ఏదైనా బొమ్మను గీస్తుంటే దాన్ని సరిగా చిత్రిస్తున్నామో లేదో అనేదీ తెలుసుకోవచ్చు. బాగా లేకపోతే సరి చేయటానికి సూచనలనూ తీసుకోవచ్చు. ఏదైనా బొమ్మను చూపించి దాని మీద కథ చెప్పమనీ అడగొచ్చు. ఇలా ఎలాంటి పనుల్లోనైనా వ్యక్తిగత సహాయకుడిలా అస్త్రను వాడుకోవచ్చు. ఈ సంవత్సరం చివర్లో జెమినీ యాప్‌లో దీన్ని సమ్మిళితం చేయాలని గూగుల్‌ భావిస్తోంది. మున్ముందు స్మార్ట్‌ గ్లాసెస్‌లోనూ దీన్ని నిక్షిప్తం చేయనున్నారు. 


అవసరానికి తగిన ఛాట్‌బాట్‌

అవసరాలకు తగినట్టుగా ఛాట్‌బాట్స్‌ను సృష్టించుకోవటానికి తోడ్పడే జెమ్స్‌ రూపకల్పన మరో విశేషం. ఓపెన్‌ఏఐకి చెందిన జీపీటీల మాదిరిగానే జెమ్స్‌ ద్వారా జెమినీకి సూచనలు ఇవ్వచ్చు. ఇలా జిమ్, కోడింగ్, వంటలు వంటి అంశాలకు చెందిన ప్రత్యేక ఛాట్‌బాట్స్‌ను సృష్టించుకోవచ్చు. జెమ్‌ చేయాల్సిన పనులేంటో, అదెలా ప్రతిస్పందించాలో ప్రాంప్ట్‌ ద్వారా జెమిని ఏఐకి వర్ణిస్తే చాలు. దానికి తగిన జెమ్‌ను రూపొందిస్తుంది. ఉదాహరణకు- ‘నువ్వు నా జిమ్‌ కోచ్‌. రోజూ చేయాల్సిన వ్యాయామాలను వివరించు. బద్ధకం వదిలించుకొని, చురుకుగా ఉండేలా చూడు’ అని వర్ణించారే అనుకోండి. వాటికి తగిన జెమ్‌ చిటికెలో సిద్ధమవుతుంది. జెమినీ అడ్వాన్స్‌డ్‌ చందాదారులకు త్వరలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది.


హోంవర్క్‌లో చేదోడు

సర్కిల్‌ టు సెర్చ్‌ ఫీచర్‌ విద్యార్థులకు చేదోడుగా నిలిచేలా ముస్తాబయ్యింది. అసైన్‌మెంట్లను షార్ట్‌కట్‌గా పూర్తి చేయటం కాదు. ఒక ఉపాధ్యాయుడిలా సవివరంగా అర్థం చేసే వినూత్న ఎడ్యుకేషన్‌ టూల్‌ ఇది. దీని సాయంతో ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్ల మీద నేరుగా గణిత, భౌతికశాస్త్ర హోంవర్క్‌ను తేలికగా చేసుకోవచ్చు. కేవలం సమాధానాలు ఇచ్చేలా కాకుండా సమస్య, పరిష్కార పద్ధతులను లోతుగా అర్థం చేసుకునేలా దీన్ని రూపొందించటం గమనార్హం. అంటే సొంతంగా సమస్యలను పరిష్కరించుకునేలా విద్యార్థులకు శిక్షణ ఇస్తుందన్నమాట. ఉదాహరణకు ఏదైనా లెక్క మీద వేలితో చుట్ట చుట్టారనుకోండి. అప్పుడు ఏఐ ఆధారిత అసిస్టెంట్‌ టూల్‌ సాయం చేయటానికి సిద్ధమవుతుంది. ఆ లెక్కను పద్ధతిగా విభజిస్తుంది. అంచెలంచెలుగా ఎలా విడగొట్టాలో వివరిస్తూ తగు సూచనలు చేస్తుంది. చివరికి సొంతంగా జవాబు కనుక్కునేలా చేస్తుంది. 


నానో ఏఐ మోడల్‌ తెలివిగా

మొబైల్‌ పరికరాలకు ఉద్దేశించిన లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ ‘జెమినీ నానో’ మరింత మెరుగైంది. దీని పేరు జెమినీ నానో 1.0 మోడల్‌. బోలెడన్ని సామర్థ్యాలు దీని సొంతం. దీని ద్వారా ఎలాంటి ఇన్‌పుట్‌తోనైనా అవుట్‌పుట్‌ పొందొచ్చు. ఇది టెక్స్ట్‌ ప్రాంప్ట్‌లనే కాదు.. ఫొటోలు, మాటలు, వెబ్, చివరికి సోషల్‌ మీడియా వీడియోలు, కెమెరాలోని ప్రత్యక్ష వీడియోలనూ అర్థం చేసుకోగలదు. అనంతరం ఇన్‌పుట్‌ను క్రోడీకరించి సారాంశాన్ని తెలియజేస్తుంది. అడిగిన ప్రశ్నలకు జవాబులిస్తుంది. దీని సాయంతో షెల్ఫ్‌లోని పుస్తకాలన్నింటినీ ఫోన్‌ కెమెరాతో ఫొటో తీసి, వాటి పేర్లను జాబితాగా రూపొందించటమూ సాధ్యమేనని గూగుల్‌ ప్రదర్శించిన వీడియో చెబుతోంది. ఈ తాజా ఏఐ మోడల్‌ను ఈ సంవత్సరం చివరికి పిక్సెల్‌ 9 ఫోన్లలో నిక్షిప్తం చేయనున్నారు.

క్లౌడ్‌ ఆధారిత ఏఐ వ్యవస్థ అయిన జెమినీ 1.5 ప్రొ ప్రపంచవ్యాప్తంగా డెవలపర్లందరికీ అందుబాటులోకి రానుంది కూడా.


వీడియోతోనూ లెన్స్‌ శోధన

గూగుల్‌ లెన్స్‌ ద్వారా ఇమేజ్‌లతో సెర్చ్‌ చేయటం తెలిసిందే. మరి వీడియోల సాయంతోనూ శోధిస్తే? ఇప్పుడు గూగుల్‌ లెన్స్‌ ఫీచర్‌ను ఇలాగే మార్చారు. అంటే దేని గురించైనా తెలుసుకోవాలనుకుంటే దాన్ని వీడియో తీసి సెర్చ్‌ చేయొచ్చన్నమాట. వీడియో ప్లే అవుతున్నప్పుడు మాట రూపంలో ప్రశ్నిస్తే దానికి సంబంధించిన జవాబు ఇస్తుంది. ఉదాహరణకు- గ్రామ్‌ఫోన్‌ రికార్డు మీద ముల్లు నిలవటం లేదనుకోండి. దీన్ని వీడియో తీసి ‘ముల్లు ఎందుకు నిలవటం లేదు?’ అని అడిగితే అక్షర రూపంలో కారణాలను ఏకరవు పెడుతుంది. వాటి ఆధారంగా పరిష్కరించుకోవటమే తరువాయి. 


వియోతో వీడియోల సృష్టి 

పదాల సూచనలతో వీడియోను సృష్టించే ఏఐ టూల్స్‌ రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. దీనికి మంచి ఉదాహరణ వియో. ఇది అధునాతన వీడియో జనరేషన్‌ మోడల్‌. అత్యంత స్పష్టమైన 1080పీ రెజల్యూషన్‌లో ఆకర్షణీయమైన దృశ్యాలు, శైలులతో నిమిషం నిడివి వీడియోలను సృష్టించగలదు. ప్రాంప్ట్‌ ఉద్దేశాన్ని కచ్చితంగా గ్రహించి అద్భుతమైన వీడియోలను రూపొందించటం దీని ప్రత్యేకత. వీడియోను అవసరమైన మేరకు ఎడిట్‌ చేసుకోవచ్చు కూడా. సినిమా దర్శకులు, స్టూడియోల సహకారంతో గూగుల్‌ ఈ మోడల్‌ను రూపొందించింది. వీడియోఎఫ్‌ఎక్స్‌ ద్వారా ఇప్పటికే కొందరు దర్శకులకు అందుబాటులోకి తెచ్చింది. మున్ముందు యూట్యూబ్‌ షార్ట్స్‌ వంటి ఇతర సాధనాలకూ దీని సామర్థ్యాలను వర్తింపజేయాలని భావిస్తోంది. 


అసిస్టెంట్‌తో ప్రత్యక్ష సంభాషణ

గూగుల్‌ ఏఐ అసిస్టెంట్‌ ఇప్పుడు జెమినీ లైవ్‌తో పరిపుష్టమైంది. ఇది గూగుల్‌ మెసేజెస్‌లో అందుబాటులో ఉంటుంది. మెసేజింగ్‌ యాప్‌లోనే నేరుగా జెమినీతో ఛాట్‌ చేయటానికిది వీలు కల్పిస్తుంది. ఆయా వ్యక్తుల అవసరాలకు అనుగుణంగా స్పందించటం దీని ప్రత్యేకత. జెమినీ లైవ్‌ సాయంతో సంక్లిష్ట సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఇది యూజర్ల తరపున పనులు చేసి పెడుతుంది కూడా. దీంతో ఛాట్‌ చేస్తుంటే అచ్చం మనుషులతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగానే ఉంటుంది. అంతా అధునాతన స్పీచ్‌ టెక్నాలజీ మహిమ. ఎక్కడా రోబోతో మాట్లాడుతున్నట్టు అనిపించదు. యూజర్లు తమదైన వేగంతో దీంతో సంభాషించొచ్చు. జెమినీ మాట్లాడుతున్నప్పుడు మధ్యలోనూ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఉదాహరణకు- ఇంటర్వ్యూకు సిద్ధం అవుతున్నా రనుకోండి. లైవ్‌ ఫీచర్‌ను యాక్టివేట్‌ చేసి, ఇంటర్వ్యూకు సన్నద్ధం చేయమని అడగొచ్చు. అప్పుడు జెమినీ నమూనా ఇంటర్వ్యూను నిర్వహిస్తుంది. మాట్లాడుతున్నప్పుడు ఏయే విషయాలను ప్రముఖంగా పేర్కొనాలో నేర్పిస్తుంది. జెమినీ లైవ్‌లో 10 రకాల సహజ శబ్ద గొంతులు ఉంటాయి. ఇష్టమైనది ఎంచుకోవచ్చు. స్వరం, మాట్లాడే తీరునూ మార్చుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని