Sundar Pichai: ‘ఏఐని తలచుకుంటే నిద్రలేని రాత్రులు..!’: గూగుల్‌ చీఫ్‌

కృత్రిమ మేధను (Artificial Intelligence) సరైన విధంగా అమల్లో పెట్టకపోయినట్లయితే హానికరమైన పరిణామాలు తప్పవని.. అందుకే దానిపై నియంత్రణ అవసరమని గూగుల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai) స్పష్టం చేశారు.

Updated : 17 Apr 2023 20:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కృత్రిమ మేధను (Artificial Intelligence) సరైన విధంగా వినియోగించకుంటే హానికరమైన పరిణామాలు తప్పవని గూగుల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai) హెచ్చరించారు. అటువంటి ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ఏఐ సాంకేతికతపై నియంత్రణ ఉంచాలని స్పష్టం చేశారు. ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన పిచాయ్‌.. కృత్రిమ మేధ (AI) దుష్ర్పభావాలను తలచుకుంటే నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని అన్నారు. ఈ కృత్రిమ మేధను ప్రయోజనకర మార్గంలో వినియోగించడంపై ప్రభుత్వాలు తక్షణమే దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.

‘కృత్రిమ మేధను సరైన విధంగా వినియోగించకపోతే అది చాలా హానికరం. వాటికి సమాధానాలు మనదగ్గర లేవు. సాంకేతికతలో వేగంగా మార్పులు వస్తున్నాయి. ఏఐను తలచుకుంటే రాత్రివేళల్లోనూ మేల్కొనాల్సి వస్తుందా..? అని అడిగితే కచ్చితంగా అవుననే సమాధానం చెబుతా. అత్యంత వేగంగా కొత్త సాంకేతికతను తీసుకువచ్చేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. దీంతో వాటిని అలవరచుకునే సమయం కూడా సమాజానికి దొరకడం లేదు. ఏఐతో అసత్య సమాచారాన్నీ రూపొందించే వీలుంది. ఇది సమాజానికి ప్రమాదకరం. ఇలా కృత్రిమ మేధ సాంకేతికత పెరుగుతున్న క్రమంలో వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వాలు ఓ అంతర్జాతీయ కార్యాచరణను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. అణ్వాయుధాల కార్యాచరణ మాదిరిగానే ఇది కూడా ఉండాలి’ అని గూగుల్‌ చీఫ్‌ సుందర్‌ పిచాయ్‌ అభిప్రాయపడ్డారు.

మానవ మేధస్సుతో పోటీ పడుతూ ఏఐ సాంకేతికతో వస్తోన్న వ్యవస్థలు (చాట్‌జీపీటీ వంటివి) సమాజానికి, యావత్‌ మానవాళికి తీవ్ర ముప్పును తలపెట్టే ప్రమాదం ఉందని అంతర్జాతీయ టెక్‌ దిగ్గజ సంస్థల అధిపతులు ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ తరహా వ్యవస్థల అభివృద్ధిని నిలిపివేయాల్సిన అవసరం ఉందని కోరుతూ రాసిన బహిరంగ లేఖలో ఎలాన్‌ మస్క్‌ వంటి కీలక వ్యక్తులు సంతకాలు చేశారు. సానుకూల ఫలితాలు ఇవ్వగలిగే ఏఐ వ్యవస్థలను మాత్రమే అభివృద్ధి చేయాలని.. ఒకవేళ ఏమైనా ప్రతికూల ప్రభావాలు తలెత్తినా.. వాటిని నియంత్రించగలమనే విశ్వాసం ఉంటేనే శక్తిమంతమైన ఏఐలను రూపొందించే దిశగా అడుగులు వేయాలని హితవు పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని